టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మూడో సారి హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నారు. మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో రూపొందనున్న మూడో సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కథ ఏమై ఉంటుంది? .. ఎలాంటి పాత్రలో బాలకృష్ణ కనిపించనున్నాడు? అనే ఆత్రుత అందరిలోను కనిపిస్తోంది.
ఈ రెండు విషయాలకి సంబంధించి ఫిల్మ్ నగర్లో ఒక వార్త షికారు చేస్తోంది. నవగ్రహాలు .. అవి మనుషులపై చూపే ప్రభావంతో ఈ కథ సాగుతుందట. ఈ సినిమాలో వారణాసికి సంబంధించిన ఎపిసోడ్లో బాలకృష్ణ ‘అఘోర’గా కూడా కనిపిస్తాడని చెబుతున్నారు. బాలకృష్ణ అఘోర లుక్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. వరుస పరాజయాలతో ఉన్న బాలకృష్ణ, ఈ సినిమాతో తప్పకుండా హిట్ పడాలనే పట్టుదలతో ఉన్నారట. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన కనిపించే హీరోయిన్స్ ఎవరనే విషయంలో త్వరలోనే స్పష్టత కూడా రానుంది.