సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం కార్యాలయానికి వచ్చిన బాలయ్య.. టీడీపీ సీనియర్ నేతలతో కీలక భేటీ నిర్వహించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులతో పాటు అనుబంధ సంఘాల నేతలతో సమావేశం అయ్యారు. చంద్రబాబు అరెస్ట్‌పై ఎన్టీఆర్ భవన్‌లో కూడా టీడీపీ నేతలు నిరసనలు చేపడుతున్నారు. చంద్రబాబుకు మద్దతుగా నిరాహార దీక్షలు చేపడుతున్నారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కూడా చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ టీడీపీ నేతలు, కార్యకర్తలు అభిమానులు ఆందోళనలు చేపడుతున్నారు.ఇటీవల హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఓఆర్ఓర్‌పై కార్ల ర్యాలీ చేపట్టడంతో పాటు నగరంలోని ఐటీ కారిడార్లలో జంక్షన్ల వద్ద రాస్తారోకోలు చేపట్టారు. పోలీసుల ఆంక్షలతో ఇటీవల ఐటీ ఉద్యోగులు సైలెంట్ అయ్యారు. ఈ క్రమంలో సీనియర్ నేతలతో బాలయ్య భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. చంద్రబాబు అరెస్ట్‌కు సంబంధించి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
అంతే కాక, ఏపీ రాజకీయాల్లో కొత్త ప్రచారం మొదలైంది. వారాహి యాత్రలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అలియాస్ బాలయ్య పాల్గొనబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయ్. వారాహి ఎక్కబోతున్న బాలకృష్ణ.. టీడీపీ, జనసేన పొత్తులపైనా, రాబోయే రోజుల్లో రెండు పార్టీలు కలిసి ఎలా ముందుకు వెళ్లాలి.. ఏవిధంగా వైసీపీని అధికారానికి దూరం చేయాలనే దానిపై ప్రసంగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. వైసీపీని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఢీకొట్టడం.. అధికారం నుంచి దించడం అంత ఈజీ వ్యవహారం కాదు. అది టీడీపీ, జనసేన నేతలకు ఇద్దరికీ తెలుసు. జనాల నుంచి వ్యతిరేకత తీసుకువస్తేనే.. వైసీపీని ఓడించడం సాధ్యం అవుతుంది. అందుకోసమే పవన్‌తో పాటు బాలకృష్ణ కూడా వారాహి ఎక్కేందుకు సిద్ధం అయ్యారనే ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు రెండు పార్టీల మధ్య బంధాన్ని కూడా వారాహి నుంచే జనాలకు చాటిచెప్పాలన్న ప్లాన్ కూడా ఉండి ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది.