ఏపీలో ఏమి చేసినా అందులో ఒక తప్పు వెతుకుతుంది ప్రధాన ప్రతిపక్షం టీడీపీ! నాయకులు బయట తిరిగి సేవ చేస్తే… కరోనా వ్యాప్తికి కారణం అవుతున్నారని! సీఎం స్థాయి వ్యక్తి ఇంట్లోనే ఉండి రాష్ట్రం మొత్తాన్ని పరిశీలిస్తూ, అధికారులను పర్యవేక్షిస్తూ, మంత్రులకు సలహాలిస్తూ కరోనాపై పోరుకు ఎంత శ్రద్ధ పెడుతున్నారో, సంక్షేమానికీ అదేస్థాయిలో శ్రద్ధ పెట్టి పనిచేస్తుంటే… ఇంట్లో నుంచి బయటకు రారా అని అంటున్నారు. ఇది వాళ్ల రెండు నాలుకల సిద్ధాంతానికి నిదర్శనం అనే విషయం కాసేపు పక్కన పెడితే… దాదాపు ఇదే సూత్రాన్ని ఫాలోఅవుతున్నట్లుంది తెలంగాణ బీజేపీ!
వివరాళ్లోకి వెళ్తే… భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా… కరోనా పాజిటివ్ కేసులను దాచేందుకు తెలణ్గాణ రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తోందని.. ఒక్కసారిగా కేసులు తగ్గడంపై అనుమానాలు ఉన్నయని చెప్పుకొచ్చారు బండి సంజయ్! అంతేనా… ప్రభుత్వ వ్యవహారశైలి వల్లే ప్రజల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయని.. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో ప్రజల్లో కొంత గందరగోళం నెలకొందని విరుచుకుపడిపోయారు. ఇన్ని సౌకర్యాలున్న హైదరాబాద్ లో కరోనా కేసులు పెరగడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు.
టెస్టుల సంఖ్యలు పెంచండి అని డిమాండ్ చేయాల్సిన ప్రతిపక్ష నాయకులు… ఏదో రూపంలో ఆరోపణలు, రాజకీయ విమర్శలు చేస్తుండటం కాస్త ఆశ్చర్యంగానే కనిపిస్తుంది. కేసులు పెరిగితే ప్రభుత్వ నిర్లక్ష్యం… కేసులు తగ్గితే, కొత్త అనుమానాలు పుట్టుకురావడం! ఏపీ టీడీపీ చేస్తుంది ఇదే… ఇదే విషయాన్ని టి బీజేపీ కూడా ఫాలో అవుతుందన్నమాట!