బంగ్లాదేశ్ లోొ భారీ అగ్ని ప్రమాదం… నౌకలో మంటలు చెలరేగి 36 మంది దుర్మరణం

బంగ్లాదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం చెలరేగింది. నౌకలో అగ్ని ప్రమాదం చెలరేగడంతో 36 మంది దుర్మరణం పాలయ్యారు. దాదాపు 200 మంది దాకా ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది. రాజధాని ఢాకాకు దక్షిణంగా 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఝలకతిలోని సుగంధ నదిపై ప్రయాణీకుల లాంచీలో మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. శుక్రవారం తెల్లవారు జామున సుగంధ నదిలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. నౌక ఇంజన్ రూంలో ప్రమాదం కారణంగానే ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

మంటల్లో గాయపడిన వారికి స్థానికంగా ఉన్న ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రమాదంలో మరికొంత మంది మరణించే అవకాశం ఉందని తెలుస్తోంది. సుమారు మూడు గంటల పాటు చెలరేగిన మంటల్లో చాలా మంది తమను తాము కాపాడుకునేందుకు నదిలోకి దూకారు. ప్రమాద సమయంలో దాదాపు నౌకలో 500 మంది ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 2 గంటల కష్టపడి మంటలను అదుపులోకి తెచ్చారు.