సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు అధిక పింఛను అమల్లో భాగంగా ఈపీఎఫ్‌వో కీలక నిర్ణయం తీసుకుంది. కార్మికులు, ఉద్యోగులు, పింఛనుదారులకు యాజమాన్యాలు చెల్లించిన 12 శాతం చందాలో నుంచే 1.16 శాతం మొత్తాన్ని ఉద్యోగుల పింఛను పథకం (ఈపీఎస్)కు జమ చేసేలా ఈపీఎఫ్‌వో చట్టాన్ని సవరించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర కార్మిక శాఖ.. ఈ నిబంధన 2014 సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. బేసిక్, డీఏ, ఇతర భత్యాలు సహా వేతనం రూ.15,000 మించిన వారికి మాత్రమే ఈ నిబంధన వర్తించనుంది.
అధిక పింఛనుకు అర్హత పొందని ఉద్యోగులకు, రూ.15 వేలు, అంతకన్నా తక్కువ వేతనం కలిగిన ఉద్యోగులకు మాత్రం యథావిధిగా ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారమే యజమాని వాటా నుంచి 8.33 శాతం పింఛను నిధిలో, మిగతా 3.67 శాతం ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాలో జమ అవుతుంది. పింఛను నిధి పథకానికి ఈపీఎఫ్‌వో 2014 సెప్టెంబరు 1న సవరణలు చేసింది. దీని ప్రకారం గరిష్ఠ వేతన పరిమితిని రూ.15 వేలకు పెంచింది.