ఇకపై క్రెడిట్‌ కార్డులో బిల్లు కంటే ఎక్కువ అమౌంట్‌ చెల్లించలేరు

-

క్రెడిట్‌ కార్డును వాడేవాళ్లు రెండు రకాలుగా ఉంటారు. కొందరు విచ్చలవిడిగా ఖర్చుపెట్టి.. బిల్‌ టైమ్‌ వచ్చేసరికి కేవలం మినిమమ్‌ డ్యూ మాత్రమే కడతారు. ఇంకొందరు.. బిల్‌ వచ్చినదానికంటే.. ఆ క్షణం ఎంత ఔట్‌స్టాడింగ్‌ ఉందో అది మొత్తం పే చేస్తుంటారు. ఇకపై క్రెడిట్‌ కార్డులో చెల్లించాల్సిన బిల్‌ కంటే ఎక్కువగా చెల్లించడానికి వీలు లేదంట. ఒకవేళ మీరు బిల్లు మొత్తం కంటే అధికంగా చెల్లిస్తే బ్యాంకులు ఆ మొత్తాన్ని మీకు తిరిగి చెల్లించేస్తాయి.

క్రెడిట్‌ కార్డు యూజర్లలో ఎక్కువ మంది బిల్లు చెల్లించాల్సిన మొత్తాన్నే పే చేస్తారు. కొందరైతే మినిమమ్‌ బిల్లు మాత్రమే పే చేస్తుంటారు. కొందరు మాత్రం అధికంగా బిల్లు పే చేస్తుంటారు. దీని వల్ల మనీలాండరింగ్‌, మోసాలు జరుగుతున్నట్లు బ్యాంకులు గుర్తించాయి. అందుకే ఈ నిబంధన తీసుకొచ్చాయి. ముఖ్యంగా విదేశీ కొనుగోళ్లను ఈ నిబంధన నివారిస్తుంది. ఖాతాల్లో కొట్టేసిన సొమ్మును మోసగాళ్లు క్రెడిట్‌ కార్డులకు తరలిస్తున్నారని, తద్వారా విదేశీ లావాదేవీలకు వినియోగిస్తున్న ఉదంతాలను బ్యాంకులు గుర్తించాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నాయట.

ఇప్పటికే కొన్ని బ్యాంకులు బిల్లు మొత్తం కంటే అధికంగా చెల్లించకుండా చర్యలు తీసుకున్నాయి. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ వంటి బ్యాంకులు తమ యాప్‌ల ద్వారా బిల్లు కంటే అధిక మొత్తం చెల్లించకుండా తమ కస్టమర్లను నిలువరిస్తున్నాయి. ఇతర మార్గాల ద్వారా బిల్లు మొత్తం కంటే అధికంగా చెల్లించినా ఆ మొత్తాన్ని నిర్దేశిత గడువులోగా బ్యాంకులు తిరిగి చెల్లించనున్నాయి. ఒకవేళ క్రెడిట్‌ లిమిట్‌ కావాలంటే ఏదైనా వస్తువును కొనుగోలు చేసిన తర్వాత వెంటనే చెల్లింపులు చేసుకుని, మరుసటి కొనుగోళ్లకు ఆ లిమిట్‌ వినియోగించుకోవాలని బ్యాంకులు తెలిపాయి.

కాబట్టి ఇక నుంచి బిల్లు కంటే ఎక్కువ అమౌంట్‌ చెల్లించకండి. చాలామంది ఇలా అసలు చేయరేమో కదా..! పుణ్యానికి అందులో ఉంచుకోవడం ఎందుకు.. బిల్‌ జనరేట్‌ అయినప్పుడే చూసుకుందాంలే అనుకుంటారు. కానీ బ్యాంకులు అనుకుంటున్నట్లు మోసాలు చేసేవాళ్లు ఇలాంటి మార్గాలనే ఎంచుకుంటున్నారేమో.!

Read more RELATED
Recommended to you

Latest news