ప్రజల ఆరోగ్యాలను ప్రభుత్వం గాలికొదిలేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ప్రజలకు భరోసా కల్పించడంలో సర్కారు విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకోవడం వల్లనే కొవిడ్ మరణాలు సంభవిస్తున్నాయన్నారు.
కాంగ్రెస్ నేతలతో కలిసి ఖమ్మం జిల్లా ఆస్పత్రిని భట్టి సందర్శించారు. వైద్యాధికారులతో మాట్లాడారు.
కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.జిల్లాలో కరోనాను నియంత్రించడంలో మంత్రి పువ్వాడ అజయ్ విఫలమయ్యారని భట్టి ఆరోపించారు. ఉపాధి హామీ పనులకు శంకుస్థాపన చేయడం, హరితహారంలో మొక్కలు నాటడం అభివృద్ధి కాదన్నారు. జిల్లా యంత్రాంగాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత.. మంత్రి తీసుకోవాలని సూచించారు.కరోనా నియంత్రణలోకి వచ్చేంతవరకు గ్రామాల్లోని మద్యం దుకాణాలను మూసేయాలని భట్టి డిమాండ్ చేశారు. అనుమానంతో వచ్చిన ప్రతీ వ్యక్తికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని సూచించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నవారికి ఐసోలేషన్ కేంద్రాల్లో చికిత్స అందించాలన్నారు. వైద్యశాఖలో అన్ని స్థాయిల్లో ఖాళీలను భర్తీ చేయాలని సూచించారు.