తమిళ జనాలకు ఎవరిమీద అయినా ప్రేమ పుట్టిందంటే చాలు వారిని నెత్తిన పెట్టేసుకుంటారు. వాళ్లకు గుళ్లు, గోపురాలు కట్టేసి పూజించేస్తుంటారు. అక్కడ అభిమానం హద్దులు దాటితే ఎలా ఉంటుందో చెప్పేందుకు ఈ గుళ్ల సంస్కృతే నిదర్శనం. అసలు భారతదేశంలోనే సినిమా వాళ్లకు, రాజకీయ నాయకులకు గుళ్లు కట్టే సంస్కృతి ఈ తమిళ్ వాళ్ల నుంచే ప్రారంభమైంది. అప్పట్లో ఎంజీఆర్, ఆ తర్వాత హీరోయిన్ ఖుష్భూ ఫామ్‌లో ఉన్నప్పుడు ఆమెకు కొందరు అభిమానులు గుడి కట్టి పూజలు చేశారు.
ఆ తర్వాత రజనీకాంత్‌తో పాటు పలువురు రాజకీయ నేతలకు అక్కడ గుళ్లు కట్టారు. ఇక ఈ సంస్కృతిని ఇప్పుడు ఏపీ వాళ్లు కూడా ఒంట పట్టించుకున్నారు. వీరు కూడా తమకు నచ్చిన నేతలకు గుళ్లు కట్టేస్తున్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్సార్‌లకు ఇప్పటికే గుళ్లు కట్టారు. ఈ నేతలు మరణించాక గుడి కడితే ఇప్పుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మాత్రం అప్పుడే గుడి కట్టి తమ అనంతాభిమానం చాటుకుంటున్నారు. ఏపీ సీఎం జగన్ పాలనకు ముగ్దులు అయిన ఆయన అభిమానులు ఆయనకు గుడి కడుతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని గోపాలపురం నియోజకవర్గంలోని రాజంపాలెం గ్రామంలో జగన్‌కు గుడి కట్టేందుకు శంకుస్థాపన చేశారు. ఈ గుడి నిర్మాణానికి ఎమ్మెల్యే తలారి వెంకట్రావు శంకుస్థాపన కూడా చేశారు. జగన్ కేవలం యేడాది పాలనా కాలంలోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారని… ఆయనను ఓ దేవుడిలా కొలవాలన్న ఉద్దేశంతోనే కోవెల కడుతున్నట్లు స్తానిక ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్ చెప్పారు.
జగన్ దగ్గరకు ఏ దుష్టశక్తులు చేరకూడదనే గుడి కట్టినట్టు ఎమ్మెల్యే వెంకట్రావు చెప్పగా.. జగన్ పథకాలు, పాలన భవిష్యత్తులో కూడా గుర్తుండి పోవాలనే తాము గుడికట్టినట్టు స్థానిక వైసీపీ నేత కూరకూరి నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు. ఇక టీడీపీ కంచుకోట అయిన పశ్చిమలో గత ఎన్నికల్లో వైసీపీ పాగా వేసింది. గత ఎన్నికల్లో జిల్లాలో రెండు ఎమ్మెల్యే సీట్లు మినహా అన్నింట్లోనూ వైసీపీ విజయం సాధించింది.