తాము చేసేది కేసీఆర్ నియంతృత్వానికి వ్యతిరేక యుద్ధం అని బీజేపీ నాయకులు కే. లక్ష్మణ్ అన్నారు. ఈ యుద్ధం రాష్ట్ర ప్రజలు చేస్తున్నారని తెలిపారు. కాగ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా 14 రోజుల ఆందోళన చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ రోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మౌన దీక్ష ప్రారంభించారు. ఈ కార్యాక్రమంలో తెలంగాణ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రంలో నియంతృత్వ పాలనకు విముక్తి కోసం పోరాడుదామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీజేపీపై అత్యంత దారుణంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఒక పార్లమెంట్ సభ్యుడి క్యాంప్ కార్యాలయంపై పోలీసులతో దాడి చేయడం దారుణం అన్నారు.
ఆదివారం రాత్రి నాటి ఘటన చూస్తే.. తెలంగాణలో ప్రజాస్వామ్యం బతికే ఉందా అని ప్రశ్న వస్తుందని అన్నారు. తెలంగాణలో కుటుంబ పాలనను దించడానికి బీజేపీ ముందు ఉండి పోరాడుతుందని తెలిపారు. అలాగే కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని రాష్ట్ర ప్రజలు బీజేపీని కోరుతున్నారని అన్నారు. అలాగే బండి సంజయ్ అరెస్టును ఖండించడానికి జాతీయ నాయకత్వం కూడా నగరానికి వస్తుందని తెలిపారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు బీజేపీ జాతియ నాయకుడు జేపీ నడ్డా వస్తున్నారని తెలిపారు. అలాగే ర్యాలీని కూడా నిర్వహిస్తామని తెలిపారు.