నూతన సంవత్సరము వచ్చేసింది. ఇక 2021 కి గుడ్ బై చెప్పేసి 2022 కి స్వాగతం పలికేసం. అయితే జనవరిలో ఎన్నో ముఖ్యమైన పండుగలు ఉంటాయి. ముఖ్యంగా పెద్ద పండుగ జనవరి నెలలో వస్తుంది. అయితే కొత్త సంవత్సరం అందరూ ఆనందంగా జరుపుకునే ఉంటారు.
ఈ కొత్త ఏడాది సందర్భంగా మంచి జరగాలని… అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుందాం. అయితే జనవరిలో వచ్చే పండుగ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా దీనికోసం చూసేయండి.
జనవరి 2 ఆదివారం పుష్య అమావాస్య
జనవరి 14 శుక్రవారం భోగి పండగ
జనవరి 15 శనివారం మకర సంక్రాంతి
జనవరి 16 ఆదివారం కనుమ పండుగ
జనవరి 21 శుక్రవారం సంకష్టహర చతుర్థి
జనవరి 23 ఆదివారం సుభాష్ చంద్రబోస్ జయంతి
జనవరి 26 బుధవారం గణతంత్ర దినోత్సవం
జనవరి 30 ఆదివారం మాస శివరాత్రి
భోగి పండుగ:
హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండగల్లో సంక్రాంతి అతిముఖ్యమైనది. ఈ పండుగని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలు నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు అయితే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజు సంక్రాంతి పండుగ. దీనికి ముందు వచ్చేది భోగి.
దక్షిణాయన సమయం లో సూర్యుడు దక్షిణ అర్థగోళంలో భూమికి దగ్గరగా రావడం వలన భూమిపై ఉష్ణోగ్రతలు తగ్గి చలి పెరుగుతుంది. అయితే ఆ చలిని తట్టుకోవడానికి భోగి మంటలు వేస్తారు. ఉత్తరాయణానికి ముందురోజు చలి విపరీతంగా పెరగడంతో దీన్ని తట్టుకునేందుకు మంటలు వేస్తారు. అలానే కష్టాలను బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ భోగి మంటలు వేయడం తరతరాలుగా వస్తోంది.
అలాగే ఈ ధనుర్మాసం నెలంతా కూడా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటిని మంటల్లో వేస్తూ ఉంటారు. అయితే ఆవుపేడతో చేసిన ఈ పిడకలని వేయడం వల్ల సూక్ష్మక్రిములు నశించి ఆక్సిజన్ గాలిలోకి అధికంగా విడుదలవుతుంది. ఈ గాలి పీల్చితే ఆరోగ్యానికి చాలా మంచిది. భోగి రోజు బొమ్మల కొలువు, భోగి పండ్లు పోయడం కూడా సంప్రదాయం.
సంక్రాంతి పండుగ:
మకర రాశిలో సూర్యుడు ప్రవేశించే కాలం ఉత్తరాయణ పుణ్యకాలంగా భావిస్తారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే నాడు మకర సంక్రాంతి అంటారు. భారతదేశంలో అందరూ ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఆరోజు రంగు రంగుల ముగ్గులు వేయడం, గాలిపటాలు ఎగురవేయడం ఇలాంటివి తరతరాలుగా వస్తున్న పద్ధతులు.
అలానే స్నానం, దానం, పితృ తర్పణం, జపతపాలు, దేవతార్చనలో సంక్రాంతి లో ముఖ్యమైన విధులుగా శాస్త్రాలు చెప్పాయి. అలానే దేవతలు, తల్లిదండ్రులు, సాటి మనుషులు, ప్రకృతి పట్ల కృతజ్ఞతా ప్రేమను ప్రకటించే పండుగల్లో సంక్రాంతి ప్రధానమైనది. ఆరోజు కుటుంబం అంతా కలిసి ఎంతో ఆనందంగా పిండివంటలు చేసుకుని ఈ పండుగని ఆనందిస్తారు.
కనుమ పండగ:
ఆంధ్ర, రాయలసీమ ప్రాంతంలో రైతులు ఘనంగా దీనిని జరుపుకుంటారు. పాడి పశువులను, పశువుల పాకలో శుభ్రం చేస్తారు. పూల తోరణాలు కట్టి మామిడి తోరణాలతో అలంకరిస్తారు. గో పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇలా మూడవ రోజు కనుమ పండగ జరుపుకుంటారు.