దేశంలో కరోనా కేసులు రోజు రోజుకీ భారీగా నమోదవుతున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ ఎడిషన్ జరుగుతుందా ? లేదా ? అనే సందేహాలు అందరిలోనూ నెలకొన్నాయి. గత ఏడాది కరోనా వల్ల ఐపీఎల్‌ను దుబాయ్‌లో నిర్వహించారు. అది కూడా ఆలస్యంగా జరిగింది. అయితే ఈసారి మాత్రం భారత్‌లోనే మొత్తం 6 వేదికల్లో ఐపీఎల్‌ను నిర్వహించనున్నారు. కానీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఐపీఎల్ జరుగుతుందా, లేదా అనే సందేహాలు వస్తున్నాయి.
కాగా ఈ విషయంపై బీసీసీఐ స్పందిస్తూ.. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఐపీఎల్ ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని తెలిపింది. స్టేడియాల్లో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లను నిర్వహించనున్నాం కనుక ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఐపీఎల్ జరుగుతుంది. అని బీసీసీఐ పేర్కొంది. పలువురు గ్రౌండ్ స్టాఫ్ కరోనా బారిన పడ్డ నేపథ్యంలో బీసీసీఐ ఈ ప్రకటన చేసింది.
ఇక ఇదే విషయమై అటు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా స్పష్టమైన ప్రకటన చేశారు. కోవిడ్ కారణంగా మహారాష్ట్రలో ఆంక్షలు విధించారని, అయినప్పటికీ ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారమే ఏప్రిల్ 9వ తేదీ నుంచి జరుగుతుందని తెలిపారు.