సాగర్ ఎన్నికల ప్రచారానికి దూరంగా టీఆర్ఎస్,బీజేపీ అగ్రనేతలు..కారణం ఇదే !

Join Our Community
follow manalokam on social media

నాగర్జున సాగర్ ఉప ఎన్నికలో స్థానిక నేతలు దూకుడుగా ప్రచారం చేస్తున్నా పార్టీల అగ్రనేత‌లు మాత్రం అటు కన్నెత్తి చూడటం లేదు. ప్రధాన రాజకీయపక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నిక పై పార్టీల వ్యూహమేంటి. రాష్ట్ర రాజకీయాల్లో ఢీ అంటే ఢీ అంటున్న టీఆర్ఎస్,బీజేపీ నేతలు సాగర్ ప్రచారాన్ని లైట్ తీసుకున్నారా..లేక అసలు గుట్టు వేరే ఉందా అగ్రనేత‌లు ప్రచారానికి రాని అసలు కారణం పై రాజకీయపక్షాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది.

ఈనెల 17న సాగార్జున‌సాగ‌ర్ ఉప ఎన్నిక జ‌రుగుతోంది. 15 సాయంత్రానికే ఎన్నిక‌ల ప్రచారం ముగియ‌నుంది. అంటే స‌రిగ్గా ప‌ది రోజుల గ‌డువు కూడా లేదు. రాజ‌కీయ పార్టీల అగ్రనేత‌లు సాగ‌ర్ వైపు చూడ‌టం లేదు. ప్రధాన రాజ‌కీయ పార్టీలైన టిఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బిజెపితోపాటు 41 మంది సాగ‌ర్ బ‌రిలో ఉన్నారు. ఇప్పటిదాకా ప్రచారం హీటెక్కలేదు. ఇటు టిఆర్ ఎస్ నుంచి గానీ అటు బిజెపి నుంచి గానీ వెళ్లడం లేదు.

టిఆర్ఎస్ నాగార్జున‌సాగ‌ర్‌లో మండ‌లానికో ఎమ్మెల్యేను ఇన్‌‌ఛార్జ్‌ను నియ‌మించింది. మంత్రులు త‌ల‌సాని, మ‌హ‌మూద‌్ అలీ, స్థానిక మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి మాత్రమే ఇప్పటిదాకా ప్రచారం చేస్తున్నారు. ఇటు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గానీ, అధ్యక్షుడు కేసియార్ గానీ సాగ‌ర్ ప్రచారంపై క్లారిటీ ఇవ్వలేదు. కేవ‌లం రెండు రోజుల‌పాటు మాత్రమే కేటీఆర్ రోడ్ షో కోసం టిఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ప్రచారం ముగియ‌డానికి ముందురోజు 14న కేసియార్ బ‌హిరంగ‌స‌భ నిర్వహించే ఆలోచ‌న‌లో ఉన్నారు.

బిజెపి అగ్రనేత‌లు కూడా సాగ‌ర్ వైపు వెళ్లడం లేదు. తిరుపతిలో సైతం తెలంగాణ నేతలు ప్రచారం చేస్తున్నారు కానీ సాగర్ వైపు కన్నెత్తి చూడటంలేదు. కేంద్రమంత్రి కిష‌న్ రెడ్డి గానీ, పార్టీ అధ్యక్షుడు బండి సంజ‌య్ గానీ ప్రచారానికి ఇంకా వెళ్లలేదు.అలాగే కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ ఠాగూర్ , పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌, సీఎల్పీ నేత భ‌ట్టి పూర్తిస్థాయి క్యాంపెయిన్ చేయ‌డం లేదు. అప్పుడ‌ప్పుడు సాగ‌ర్‌లో క‌నిపించి వ‌చ్చేస్తున్నారు. అయితే దీని వెనుక ఓ లాజిక్ ఉన్నట్లు తెలుస్తుంది. సాగ‌ర్ ఉప ఎన్నిక ప్రచారంపై కేంద్ర ఎన్నిక‌ల సంఘం గట్టి నిఘా పెట్టింది. రాజ‌‌కీయ పార్టీలకు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మార‌డంతో అంద‌రి దృష్టి ఈ ఎన్నిక‌పైనే ఉంది. ఎన్నిక‌ల నిబంధ‌న‌ల ప్రకారం అభ్యర్థి 28 ల‌క్షలు ఖ‌ర్చు పెట్టొచ్చు. అంత‌కు మించి అధికారికంగా ఖ‌ర్చు చేస్తే చిక్కుల్లో ప‌డ్డట్టే.

ఇక పార్టీల అగ్రనేత‌లు అభ్యర్థి త‌ర‌పున చేసే ప్రచారం,ఎన్నిక‌ల స‌భ‌ల ఖ‌ర్చు అంతా కూడా అభ్యర్థి అకౌంట్‌లోనే లెక్కిస్తారు. అగ్రనేత‌లు ప్రచారానికి వ‌స్తే మామాలు హ‌డావిడి ఉండ‌దు. వాహ‌నాలు, ప్రచార సామ‌గ్రి ఖ‌ర్చు అంతా అందులోనే క‌లిపేస్తారు. ఏ రోజు ఎంత ఖ‌ర్చు చేస్తున్నార‌న్న వివ‌రాలు కూడా ఎన్నిక‌ల అధికారుల‌కు స‌మ‌ర్పించాలి. దీనికి తోడు స్వతంత్ర్యంగా కూడా ఈసీ ఎన్నిక‌ల ఖ‌ర్చు అంచ‌నావేసేందుకు అధికారుల‌ను నియ‌మించుకుంటుంది. ఈ భ‌యంతోనే ఎక్కువ‌మంది నేత‌ల‌ను, పెద్ద నేత‌ల‌ను ప్రచారానికి రాకుండా దూరంగా ఉంచారు అన్న చర్చ నడుస్తుంది.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...