కరోనా ప్రభావం వల్ల ఈ ఏడాది మార్చి నుంచి మే చివరి వరకు జరగాల్సిన ఐపీఎల్ 13వ ఎడిషన్ ఇప్పటికే రద్దైన సంగతి తెలిసిందే. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈసారి ఐపీఎల్‌ను నిరవధింగా వాయిదా వేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే ప్రస్తుతం అనేక కార్యకలాపాలకు ఆంక్షలను సడలించారు. ఇక స్టేడియంలలో క్రీడలను నిర్వహించేందుకు కూడా అనుమతిచ్చారు. ప్రేక్షకులు లేకుండా క్రీడలు నిర్వహించుకోవచ్చని తెలిపారు. అయినప్పటికీ బీసీసీఐ ఈ విషయంపై ఇంకా స్పందించలేదు. అయితే ఐపీఎల్‌ను ఇప్పుడు కాకుండా సెప్టెంబర్, నవంబర్ నెలల మధ్య నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలిసింది.
దేశంలో సెప్టెంబర్ నెల వరకు కరోనా కేసులు దాదాపుగా పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. అప్పటి వరకు వ్యాక్సిన్లు కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే కరోనా ప్రభావం అప్పటికి పూర్తిగా తగ్గితే.. స్టేడియంలలో పూర్తి స్థాయిలో ప్రేక్షకులతో మ్యాచ్‌లు నిర్వహించుకోవచ్చు. ప్రస్తుతం ఖాళీ స్టేడియంలలో, విదేశీ ప్లేయర్లు లేకుండా మ్యాచ్‌లు నిర్వహించుకునే బదులు.. కరోనా తగ్గాక పూర్తి స్థాయిలో టోర్నీని నిర్వహిస్తే బాగుంటుందని.. బీసీసీఐ ఆలోచిస్తున్నదట. అందుకనే టోర్నీని సెప్టెంబర్ 25వ తేదీ నుంచి నవంబర్ 1వ తేదీల మధ్య నిర్వహించాలని అనుకుంటున్నారు.
అయితే అదే సమయంలో టీ20 వరల్డ్ కప్ నిర్వహించాల్సి ఉంది. కానీ కరోనా వల్ల ఆ టోర్నీ జరుగుతుందా.. లేదా అన్నది అనుమానాస్పదంగా మారింది. ఒక వేళ టీ20 టోర్నీ పోస్ట్‌పోన్ అయితే.. అదే సమయంలో ఐపీఎల్ ను నిర్వహించాలని బీసీసీఐ చూస్తోంది. మరి అప్పటి వరకు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి..