బీసీసీఐ నిర్వహించనున్న ఐపీఎల్ టోర్నీని బ్యాన్ చేయాలని ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరన్ మంచ్ (ఎస్‌జేఎం) పిలుపునిచ్చింది. ఐపీఎల్ టోర్నీ నేపథ్యంలో ఆదివారం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశమై.. టోర్నీ టైటిల్ స్పాన్సర్‌గా చైనా మొబైల్స్ తయారీదారు వివోను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ఎస్‌జేఎం మండిపడింది. ఓ వైపు భారత సైనికులను చైనా ఆర్మీ చంపేస్తుంటే..ఆ దేశానికి చెందిన కంపెనీలకు లాభం చేకూర్చేలా బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వ్యవహరిస్తున్నాయని ఆరోపించింది.
బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌లు దేశాన్ని అవమానపరిచాయని ఈ సందర్భంగా ఎస్‌జేఎం కో కన్వీనర్ అశ్వాని మహాజన్ అన్నారు. చైనాకు చెందిన కంపెనీలకు భారత్‌లో అవకాశాలు లేకుండా చేస్తుంటే.. మరోవైపు బీసీసీఐ, ఐపీఎల్ యాజమాన్యాలు ఆ దేశ కంపెనీకి ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్‌ను కొనసాగించడం దారుణమని అన్నారు. అందువల్ల ఐపీఎల్‌ను బ్యాన్ చేయాలని అన్నారు. ఐపీఎల్ నిర్వాహకులు, బీసీసీఐ ఈ విషయంపై పునరాలోచన చేయాలన్నారు. దేశ భద్రత, సమగ్రతకన్నా ఏదీ ఎక్కువ కాదని వ్యాఖ్యానించారు.
కాగా వివో కంపెనీ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులకు గాను గతంలో బీసీసీఐకి రూ.2వేల కోట్లు చెల్లించింది. దీంతో 5 ఏళ్ల పాటు వివోకు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులు ఉంటాయి.