సెప్టెంబర్ 19 నుంచి యూఏఈలో జరగనున్న ఐపీఎల్ 13వ ఎడిషన్ కోసం ఫ్రాంచైజీలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి. పలు టీంలు క్వారంటైన్లో ఉండగా.. కొందరు జట్ల సభ్యులు ప్రాక్టీస్ మొదలు పెట్టేశారు. అయితే ఐపీఎల్‌కు 20 రోజుల గడువు మాత్రమే ఉన్నా ఇంకా బీసీసీఐ టోర్నీ షెడ్యూల్‌ను మాత్రం విడుదల చేయలేదు. కానీ మరో రెండు రోజుల్లో షెడ్యూల్ విడుదలవుతుందని తెలుస్తోంది.
ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుతో ప్రస్తుతం బీసీసీఐ చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. యూఏఈలో దుబాయ్, అబుధాబి, షార్జాలలో ఐపీఎల్‌ను నిర్వహించనున్న దృష్ట్యా ఆ దేశ క్రికెట్ బోర్డుతో చర్చించి బీసీసీఐ ఐపీఎల్ షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. ఈ క్రమంలో ఆగస్టు చివరి తేదీ వరకు షెడ్యూల్ వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ టీంలో 12 మందికి, ఒక బౌలర్‌కు కరోనా సోకడం కలకలం రేపుతోంది.
టోర్నీ గడువు దగ్గరపడుతున్న కొద్దీ బీసీసీఐ ఏర్పాట్లను చేస్తుండగా.. ప్లేయర్లు, సిబ్బంది కరోనా బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఐపీఎల్ జరిగేందుకు ఇంకా సమయం ఉంది కనుక అప్పటి వరకు అంతా సద్దు మణుగుతుందని బీసీసీఐ ఆశిస్తోంది. మరి ఐపీఎల్ షెడ్యూల్‌ను బీసీసీఐ ఎప్పుడు విడుదల చేస్తుందో చూడాలి.