ప్రేమ ఎలా ఉంటుంది..ఊరూ పేరూ లేకుండా ఉంటుంది. ఊరూ పేరూ కలుపుకుని కూడా ఉంటుంది. ప్రేమ ఎలా ఉంటుంది ప్రతి వ్యథకూ ఓ తీర్పరిలా ఉంటుంది. ప్రతి వ్యథనూ తీర్చేందుకు సిద్ధంగా ఉంటుంది.ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ అని రాశారు సినీ కవి..సిరివెన్నెల..అవును! బంధించే ప్రేమ ఒకటి,కవ్వించే ప్రేమ ఒకటి..కవ్వింపుల తరువాత సాధించే ప్రేమ ఇంకొకటి..కనుక పెదవుల సంతకం అందుకున్న దేహాలలో ప్రేమ పరిపూర్ణం అవుతుందని అనుకోలేం..ప్రేమ ప్రారంభం అయింది అని మాత్రమే చెప్పగలం.
ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ
ఏ మది నెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ
ఈ పాట మరోసారి వినండి.. మనసంతా నువ్వే సినిమా కోసం వెన్నెల కవి సీతారామ శాస్త్రి రాశారు. ఆకాశం అంత ప్రేమకు ప్రతి ఆశా జీవి బానిసగా ఉంటాడు. జన్మలో బంధాలను సుదృఢం చేసుకోవడంలో ఉన్న విలీనత,వినమ్రత అన్నవి ప్రేమించేందుకు కారణం అవుతాయి. ప్రేమను కాపాడుకునేందుకు కారణం అవుతున్నాయి.
అర్థం కాని పుస్తకమే అయినా కానీ ఈ ప్రేమ
జీవిత పరమార్థం తానే అనిపిస్తుంది ఈ ప్రేమ
అవును! జీవితాకాశాన ఉన్నవన్నీ గొప్పవి..తారలు కాంతులు చీకట్లు వెలుతురు వాకిళ్లు అన్నీ గొప్పవి. ఆ పుస్తకంలో అన్నీ జ్ఞాపక సంబంధ కాంతులు.. విషాద సంబంధ రాత్రులు. నగ్న దేహాల కాంతుల్లో ప్రేమ పరివర్తన గుణకం అవుతుందా!లేదా?
పశ్చాత్తాప చింతన జీవిత కాలాన్ని వేధిస్తోంది. జీవితాలను పరి సమాప్తి చేస్తుంది కూడా కొన్ని సార్లు.
ఇంతకుముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ
ప్రతి ఇద్దరితో మీ గాధే మొదలంటుంది ఈ ప్రేమ
ఎన్నో కథలు ఉన్న ఈ ప్రపంచాన ప్రేమ దగ్గర ఓటములే అంతిమ ఫలితాలు అయి ఉన్నాయి. ఓటమే నిర్ణయాత్మకం అయిన రోజు మనిషి గెలిచి ప్రేమ ఓడిన తరుణాలు ఉన్నాయి. ప్రేమ గెలిచి మనిషిని గెలిపించిన దాఖలాలు పునరావృతి అయితే ప్రేమ విస్తృతం అయి లోకంలో మరింత స్థిరం అయి ఉంటుంది. అందుకు ఇప్పటి ప్రేమలు ఆనవాలుగా లేవు. అందుకు ఇప్పటి ప్రేమలు కారణం అయి లేవు.
కలవని జంటల మంటలలో కనపడుతుంది ఈ ప్రేమ
కలిసిన వెంటనే ఏమవునో చెప్పదు పాపం ఈ ప్రేమ
అని..సీతారామ శాస్త్రి ఈ పాటను ముగించారు. ఈ పాట రాశాక చాలా రోజులకు అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆయన తన జీవితాన్నీ ముగించారు. ప్రేమ అనే గొప్ప ప్రపంచ నిర్మాణాలకు మీరంతా సహకరించండి.. స్వప్నించడం కాదు సాకారం కోసం
శ్రమించండి.