వివాహ బంధం గట్టిగా ఉండడానికి భాగస్వాముల ఆలోచనలు ఒకేలా ఉండాలని చెబుతుంటారు. ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నప్పుడు వారి నిర్ణయాలు ఒకేలా ఉంటాయని, దానివల్ల బంధం బలంగా ఉంటుందని అనుకుంటారు. కానీ,, మీకిది తెలుసా? ఆలోచనలు వేరు వేరుగా ఉన్న జంటల మధ్యే వివాహ బంధం గట్టిగా ఉంటుందని కొంతమంది వాదన. దానికోసం కొన్ని బలమైన కారణాలను వివరిస్తున్నారు.
బంధం ఎలా ఉండాలనేది అందులో ఉన్న వారిమీదే ఆధారపడి ఉంటుంది. ఒకరి ఆలోచనలకు మరొకరు విలువ ఇస్తున్నప్పుడు గొడవలు పెద్దగా జరగవు. మీ భాగస్వామి ఆలోచన మీకు నచ్చలేదు. కానీ ఆ ఆలోచనపై మీకు గౌరవం ఉండాలి. అలాంటప్పుడు పెద్ద సమస్యలు ఏర్పడవు. చాలా వరకు గొడవలు జరిగేది వేరు వేరు ఆలోచనలు ఉన్నందు వల్ల కాదు. ఇతరుల ఆలోచనలకు గౌరవం ఇవ్వకపోవడం వల్ల. రెండింటి మధ్య చాలా తేడా ఉంది. అది అర్థమైనపుడు బంధాన్ని మరింత బాగా అర్థం చేసుకోగలరు.
ఈ ప్రపంచంలో దాదాపు 700కోట్ల మానవులు ఉన్నారు. వారందరికీ వేరు వేరు రకాల ఆలోచనలు ఉంటాయి. ఏ ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండవు. ఉన్నా కూడా అది కేవలం ఒకటి రెండు లేదా మూడు విషయాల్లో మాత్రమే. అన్నింట్లో ఒకేలా ఉండడం కూడా కరెక్టు కాదు. రెండు వేరు వేరు ప్రపంచాలు ఉన్నప్పుడే తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కువ ఉంటుంది. ఆసక్తి తగ్గిపోయి, ఇక చేసేదేమీ లేదని అనుకున్నప్పుడే విభేధాలు వస్తాయి. కొత్త ప్రపంచం కోసం వెదుకుతారు. అలా మీ ప్రపంచం ఖాళీ అవుతుంది.
అందుకే అభిప్రాయాలకు, ఆలోచనలకు గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. వాదనలకు, చర్చలకు తేడా తెలుసుకోండి. మీ బంధం బలంగా తయారవుతుంది.