యోగం.. తత్వం
మనిషి మనసు
కలయిక యోగం
శుభ యోగం
నడవడి.. నడిపించే తీరు
రెండూ వ్యక్తిత్వ సంకేతాలు
రామయ్య నడిచే ధర్మం
ధర్మానికి మరో గొప్ప రక్ష
నా చిన్ని ప్రాణానికి శ్రీ రామ రక్ష
మనందరి జీవితాలకు శ్రీ రామ రక్ష
ఆదర్శం అని చెప్పడం సులువు
ఆ గుణం పాటింపునకు మనమేం చేస్తున్నామని
రామ తత్వం ఆచరణీయం అయిన రోజు
ఆ ఇలవేల్పు సంతోషిస్తాడు.. అందాక మనం ఆ తత్వ సారాన్ని
అవలోకిస్తూ అధ్యయనం చేస్తూ మనల్ని మనం మార్చుకోవడం ఓ బాధ్యత
ప్రేమతత్వం నింపుకున్నాక రాముడు..ప్రేమ తత్వం పంచాక రాముడు.. అందాల రాముడు ఎందువల్ల దేవుడు అన్న ప్రశ్న ఒకటి ఎప్పుడో ఓ కవి సంధించాడు. కష్టం ఉన్నప్పుడు కుంగుబాటు చెందనివాడు.. గెలుపు ఉన్నప్పుడు విర్రవీగని వాడు.. ధైర్యం సాహసం రెండూ తనలో ఇముడ్చుకున్నవాడు.. అలాంటి వాడు ఎక్కడన్నా ఉంటే వాడే సిసలు రాముడు..ఆ రామయ్య అంశ అతడే అనుకోవాలి. ఆధునిక కాలంలో ఇలాంటి బిడ్డను చూడగలమా.. ఇలాంటి తమ్ముళ్లను చూడగలమా.. అన్న మాటే వేదవాక్కు గా భావించే లక్ష్మణుడ్ని చూడగలమా.. అన్న పాద రక్షలను సింహాసనం పై ఉంచి రాజ్య పాలన చేసిన భరతుడ్ని చూడగలమా… బిడ్డలకు గొప్ప ప్రేమ పంచిన తల్లి సీతమ్మ.. అంతటి తల్లులు ఇవాళ ఎందరని.. కనుక రామయ్య సీతమ్మ
ఎన్నటికీ ఆదర్శం.
అయోధ్య వాకిట రాముడు. అందాల రాముడు.. భద్రాది వాకిట రాముడు నీల మేఘ శ్యాముడు..ఒంటిమిట్ట రాముడు సకల గుణ ధాముడు..విజయనగరం రాముడు తిరుగులేని వీరుడు.. శ్రీకాకుళం రాముడు.. అడవికే అందం తెచ్చిన దేవుడు.. అవును! మా రాముడు అందరి వాడు.. కోవెల గంటలు మోగితే ఆనందిస్తూ అమ్మకు దండం పెట్టాను నేను. గుడి లో దీపం వెలిగాకు అయ్యకు పాదాభివందనం చేసి వచ్చాను నేను. దేవుడు కదా అని వదిలేయను.. వాడు నా ఇంటి బిడ్డ.. వాడు మా అందరికీ ఇష్టుడు.. ఆత్మీయ నేస్తం వాడు..
అడవిని జయించాక మనిషి ఎలా ఉన్నాడు తెలుసుకోవాలి.. అసలు అడవిని కాపాడడం అన్న పనికి ఎవ్వరూ పూనుకోవడం లేదు. రామయ్య తండ్రి ఆదేశం అదే అవుతుంది. ప్రకృతితో ఉంటూ ప్రకృతిని కాపాడమని.. అమ్మ సీతమ్మ కోరుకునేది ఇదే! బిడ్డలకు సద్బుద్ధి ప్రసాదించి మంచి పనులకు వారు కారణం కావాలని.. ఆధునికంలో అత్యుత్తమ తల్లిదండ్రులు ఏ కొందరో..
కానీ ఆ తల్లి సింగిల్ పేరెంట్.. సీతమ్మ మాయమ్మ..బిడ్డలను వీరులుగా తీర్చిదిద్దిన అమ్మ దగ్గర మనమెంత. ఆ కుశుడూ.. ఆ లవుడూ .. అమ్మనాన్నల ప్రేమకు ప్రతీక.
రాముడు మంచి తండ్రి..మంచి కొడుకు.. గొప్ప రాజు.. క్షాత్రవ ధర్మం తప్పని రాజు.. రాజ్య నీతి పాటించే రాజు.. యుద్ధ నీతి తప్పని రాజు.. అందుకే ఆయన యుద్ధం ధర్మ యుద్ధం ఆయన పథం ధర్మ పథం. ఆధునిక కాలంలో రాముడ్ని ఓ యోధుడిగానే చూడాలి. తిరుగులేని పరాక్రమ తత్వం ఉన్నా కూడా తన ధర్మం తప్పని గొప్ప మానవుడిగానే మహనీయుడిగానే చూడాలి.
రామయ్యా.. నీవు మాకు భరోసా ఇవ్వు.. ఇప్పటికి మించి శ్రమిస్తాం.. మంచి ప్రపంచ నిర్మాణం ఒకటి సాగిస్తాం. అనుకున్నది సాధిస్తాం.
– ఉత్తమ పురుష – మనలోకం ప్రత్యేకం