బాగా నిద్రపోండి అంటే చాలాసేపు అని కాదు. గాఢనిద్ర అని. మనుషులపై నిద్ర ప్రభావం గురించి ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అన్నీ సుఖనిద్ర సర్వరోగ నివారిణి అని తేల్చాయి.
నిద్ర… మనిషిని అన్ని బాధలనుంచి విముక్తం చేసే గొప్ప ఓదార్పు. మసనును తేలికపరచే దివ్యౌషదం. సుఖంగా నిద్రపోగలిగినవారు శారీరకంగా, మానసికంగా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. నిద్రలేమిని ‘ఇన్‌సోమ్నియా’ అంటారు. అదో నరకం. ప్రతి మనిషికి 6 నుండి 8 గంటల నిద్ర అవసరమని పరిశోధనలు తేల్చాయి. ఇది వారి శరీరతత్వాన్ని బట్టి నిర్ణయింపబడుతుంది. అయితే అంతకంటే ఎక్కువసేపు నిద్రపోవడం అనర్థదాయకం. నిద్ర ఎంత మంచిదో, అంత చెడ్డది కూడా. అవసరం మేరకే వాడుకోవాలి.
గాఢనిద్ర లేదా సుఖనిద్ర వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. నిద్రపై జరిగిన ఎన్నో ప్రయోగాలు దాని ఆవశ్యకత, లాభాలను నిరూపించాయి. మచ్చుకు కొన్ని చూద్దాం.
- నిద్ర ఒత్తిడిని తగ్గిస్తుంది.
- నిద్ర జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
- రక్తపోటును నియంత్రిస్తుంది.
- రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది.
- బరువును కంట్రోల్‌లో ఉంచుతుంది.
- మంచి మూడ్‌లో ఉంచుతుంది.
- గుండె పనితీరు మెరుగుపడుతుంది.
- నొప్పి నివారిణిగా ఉపయోగపడుతుంది.
- రోజంతా చురుకుగా ఉంటారు.
అయితే, పడుకోగానే, అందరికి నిద్రపట్టదు. రోజంతా జరిగిన రకరకాల వ్యవహారాల వల్ల నిద్ర దూరమవుతుంది. ఈ బాధనుండి బయటపడి, మంచి నిద్రను పొందాలంటే ఈ కింది చిట్కాలు పాటించి చూడండి. తేడా మీకే తెలుస్తుంది.
నిద్రకు సమయం కేటాయించండి
రాత్రిపూట మీరు అలసిపోయి, నిద్రమత్తు ఆవహిస్తున్నప్పుడు దాన్ని నిద్రపోయే టైమ్‌గా పరిగణించి, రోజూ అదే టైమ్‌కు నిద్రపోయేలా అలవాటు చేసుకోండి – సెలవు రోజుల్లో కూడా. అలాగే లేచేటప్పుడు కూడా ఒక టైమ్ అనుకుని అదే టైంకు అలారం పెట్టుకుని లేవడానికి ప్రయత్నించండి. రెండు మూడు రోజుల్లో మీ జీవ గడియారం ఈ కొత్త టైం టేబుల్‌కు అలవాటుపడి, నిద్రాసమయం గాడిలో పడుతుంది.
ప్రతిరోజూ వ్యాయామం చేయండి
వ్యాయామం సుఖనిద్రకు మంచి ప్రేరణ. రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్ చేసేవారికి నిద్రలేమి ఉండదు. వారానికి కనీసం నాలుగు సార్లు వ్యాయామం చేసేవారికి నిద్ర బాగా పడుతుందని పరిశోధనలు చెప్పాయి. అయితే నిద్రపోయేముందు ఎక్సర్‌సైజులు చేయకూడదు. దానివల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి, నిద్రపట్టడం కష్టమవుతుంది.
మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండండి.
పొగతాగనివారికంటే, తాగేవారిలో నిద్రలేమి నాలుగురెట్లు ఎక్కువని ‘చెస్ట్’ జర్నల్ పరిశోధన తేల్చింది. పొగలో ఉండే నికొటిన్ వల్లే నిద్రపట్టడం జరుగదని ఆ జర్నల్ తెలిపింది. అంతేకాక, ఆస్థమా, శ్వాస సంబంధిత ఇబ్బందులు కూడా తలెత్తే ప్రమాదముంటుంది. కాఫీ కూడా అంతే ప్రమాదకరం. కాఫీలో ఉండే కెఫీన్ కూడా నిద్రకు బద్దశత్రువు.
ఇక మద్యపానం వల్ల మత్తుగా ఉండి నిద్రపోయినట్లు అనిపించినా, అది నిజానికి నిద్ర కాదు. సుఖనిద్రను దూరంచేసి, శ్వాసవ్యవస్థను కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి, ఈ రెండు పానాలను మానేయడం అన్నివిధాలా మంచిది.
తీపి పదార్థాలు అసలు ముట్టుకోకండి.
రాత్రి భోజనం అయ్యాక, చాలామందికి ఓ స్వీటో, పండో తినడం అలవాటు. కానీ, ఇది కూడా నిద్రలేమికి పెద్ద కారణం. చక్కెర శరీరంలో శక్తి స్థాయిని పెంచి, నిద్రపట్టకుండా చేస్తుంది. అలాగే ఈ పదార్థాలు తొందరగా జీర్ణం కూడా అవవు. అది కూడా ఇంకో సమస్య. రాత్రిపూట తేలికపాటి ఆహారం అన్నివిధాల బెటర్. అమైనో ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల మెలటోనిన్, సెరలోనిన్ అనే హార్మోన్ల ఉత్పత్తి ఎక్కువై, నిద్ర బాగా పడుతుంది.
టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను పక్కనబెట్టండి
పడుకునేముందు టీవీ చూడటం, ల్యాప్‌టాప్ వాడటం, స్మార్ట్‌ఫోన్‌తో గడపటం నిద్రకు పెద్ద శత్రువులు. వీటివల్ల ఉత్పన్నమయ్యే ‘బ్లూ లైట్’ నిద్ర పట్టనీయదు. అదీ కాక, వాటిలో ఉండే విషయాల వల్ల కూడా ఆలోచనలు రేకెత్తి, నిద్రను ఆలస్యం చేస్తాయి. చూపు కూడా దెబ్బతింటుంది.
బెడ్‌రూమ్‌ను చీకటిగా చేసుకోండి – గాలి బాగా వచ్చేలా చూడండి.
రోజంతా మనం మంచి వెలుతురులో గడుపుతాం కనుక, అది పగలు అని, వెలుతురు లేకపోతే రాత్రి అయిందని మన మెదడు భావిస్తుంటుంది. కాబట్టి రాత్రిపూట క్రమంగా ఇంట్లో వెలుతురు తగ్గిస్తూ, బెడ్‌రూమ్‌లో పూర్తిగా ఆపేస్తే, మెదడు రాత్రి అయిందని, ఇక నిద్రపోవాలని భావించి తదనుగుణంగా శరీరాన్ని ప్రిపేర్ చేస్తుంది. అప్పుడు గాఢనిద్ర ఖాయం.
మంచి అలవాట్లు నిద్రను మీ వద్దకే తీసుకువస్తాయి.
గోరువెచ్చని నీటితో స్నానం, కాసేపు ఒక మంచి పుస్తకం చదవడం, ప్రశాంతంగా ఉండే సంగీతం వినడం.. ఇవన్నీ నిద్రను ప్రేరేపిస్తాయి. మెలకువ సమయం నుండి నిద్రాసమయానికి ప్రయాణం సాఫీగా సాగుతుంది. వాటివల్ల మీరు బాగా రిలాక్స్ కాగలుగుతారు. తద్వారా నిద్రపోవడానికి వాతావరణం అన్నిరకాలుగా అనుకూలంగా మారుతుంది.
పైన చెప్పిన పాయింట్లేమీ కష్టతరమైనవి కావు. చాలా సులువుగా ఆచరించతగినవి. బద్ధకించకుండా వాటిని మీరు పాటిస్తే, సుఖనిద్ర మీ సొంతమవుతుంది. ఆరోగ్యం మీ వెంటే ఉంటుంది.