ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో అసలు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ వైఖరి ఏంటీ అనే దానిపై అనేక అనుమానాలు ఉన్న సంగతి తెలిసిందే. రాజధానిగా అమరావతిని కాదని మూడు రాజధానులు అంటూ జగన్ చేసిన ప్రకటన, ఆ తర్వాత తీసుకునే నిర్ణయాలకు కేంద్రం మద్దతు ఉందనే వ్యాఖ్యలు కొన్ని రోజులుగా వినపడుతున్నాయి. దీనికి కేంద్రం మద్దతు ఉందని,
ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా ఇదే విషయాన్నీ చెప్పారు అంటూ జాతీయ మీడియా కూడా వ్యాఖ్యానిస్తుంది. అయితే పొత్తు పెట్టుకున్న జనసేన ముందు నుంచి మూడు రాజదానులకు వ్యతిరేకంగా ఉండటంతో ఇప్పుడు బిజెపి ఎం చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. మూడు రాజధానుల మీద రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత ఉన్న నేపధ్యంలో కేంద్ర పెద్దలు ఎలా వ్యవహరిస్తారు అనేది చూడాలి.
ఈ నేపధ్యంలో జనసేన అధినేత బిజెపి నిర్ణయంపై సంచలన వ్యాఖ్యలు చేసారు. శాశ్వత రాజధానిగా అమరావతికి కట్టుబడి ఉన్నా అని, అదే విషయాన్నీ బిజెపికి చెప్పా అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన రాజధాని అమరావతిని గౌరవిస్తామని బిజెపి నేతలు హామీ ఇచ్చారన్నారు. అమరావతి నుంచి రాజధాని కదలదని బిజెపి నేతలు హామీ ఇచ్చారని చెప్పిన పవన్, అది బిజెపి తీసుకున్న నిర్ణయమన్నారు.