మరక మంచిదే!- అన్న ఓ ప్రచారం మాదిరిగా రాజకీయాల్లో ఉన్ననాయకులకు దూకుడు కూడా మంచిదే. అయితే, ఈ దూకుడు అన్ని వేళలా మంచిదేనా? అందరి దగ్గరా మంచిదేనా? ఇప్పుడు కర్నూలు రాజకీయా ల్లో ఇదే చర్చ సాగుతోంది. ఇక్కడ ప్రస్తుతం టీడీపీ నాయకురాలుగా ఉన్న మాజీ మంత్రి భూమా అఖిల ప్రి యారెడ్డి చాలా దూకుడుగా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడంతోపాటు.. పార్టీలోనూ తన ఆధిపత్యం చూపించేందుకు ఎక్కడా వెనుకాడడం లేదు.
ఇటీవల తన సొంత నియోజకవర్గం(ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఓడిపోయినా) ఆళ్లగడ్డలో జరుగుతున్న యురేనియం నిక్షేపాల పరిశీలనను బలంగా అడ్డుకున్నారు. ఇక, సొంత పార్టీకి చెందిన నాయకుడు, తన తండ్రికి అత్యంత సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డిని కూడా తన నియోజకవర్గం దరిదాపులకు కూడా రాకుండా కట్టడి చేయడంలోనూ సక్సెక్ అయింది అఖిల ప్రియ. ఇక, ప్రస్తుతం పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో అన్ని జిల్లాల్లోనూ పార్టీ నాయకులు పడకేశారు. ఎవరూ పెద్దగా స్పందించడం లేదు.
పైగా ఎప్పుడు ఎవరు జంప్ చేస్తారో తెలియని పరిస్థితి . ఈ నేపథ్యంలో ఎవరు గట్టి వాయిస్ వినిపిస్తే.. వారికే ప్రాధాన్యం ఇచ్చేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు. ఈక్రమంలోనే అఖిల ప్రియకు అంతులేని ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ఆమె నియోజకవర్గంలో రెచ్చిపోతున్నారని సొంత పార్టీ కార్యకర్తలు, నేతల నుంచే ఆరోపణలు వినిపస్తున్నాయి. అధికారంలో లేకపోయినా అధికారం ఉన్నట్టుగానే వ్యవహరిస్తున్నారని, కార్యకర్తలను, నాయకులను కలుపుకొని పోవడం లేదన్న టాక్ ఉంది.
గతంలో ఆమె తండ్రి నాగిరెడ్డి అధికారంలో ఉన్నా.. లేకున్నా.. కార్యకర్తలకు, నేతలకు ప్రాధాన్యం ఇచ్చి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారని, కానీ, ఇప్పుడు అఖిల మాత్రం.. నాయకులను దూరం పెట్టి.. కార్యకర్తలను పట్టించుకోకుండా.. తానే ఒక రుద్రమ దేవిలాగా, ఝాన్సీరాణి మాదిరిగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. మరి పరిస్థితి ఇలా ఉంటే, జిల్లాలో ఆమె దెబ్బకు పార్టీ ఖాళీ అయినా ఆశ్చర్యం లేదనిచెబుతున్నారు. స్పీడ్ ఉండాల్సిందే అయినా. బ్రేకులు కూడా ఉండాల్సిన అవసరం ఉంది కదా!! అని సూచిస్తున్నారు. సో.. ఇదీ.. భూమా అఖిల ప్రియ కహానీ..!