కరోనా పుణ్యమా అని మన స్టాక్ మార్కెట్ లు భారీగా నష్టపోతున్నాయి. వేల పాయింట్లు నష్టపోతూ… భారీగా సంపద ఆవిరి అయిపోతుంది. లక్షల కోట్ల సంపద కళ్ళ ముందే నాశనం అయిపోతుంది. తాజాగా స్టాక్ మార్కెట్ మరింత పతనం కావడంతో ట్రేడింగ్ నిలిపివేశారు. శుక్రవారం ఉదయం భారీ నష్టాల్లో ప్రారంభం అయ్యాయి స్టాక్ మార్కెట్ లు. నిఫ్టీ ప్రారంభంలో మూడు ఏళ్ళ కనిష్ట స్థాయిని తాకింది.
9 వేల పాయింట్ల దిగువున ప్రారంభం అయింది. సెన్సెక్స్ విషయానికి వస్తే… మూడు వేల పాయింట్ల నష్టాలతో ప్రారంభం అయింది. నిఫ్టీ, సెన్సెక్స్ సూచీ 10 శాతం మేర నష్టపోయిన నేపధ్యంలో నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ లో ట్రేడింగ్ ని నిలిపివేశారు. మార్కెట్ 10 శాతం, 15 శాతం, 20 శాతం పడిపోయినప్పుడు సర్క్యూట్ బ్రేకర్లు ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్ మార్కెట్లలో ట్రేడింగ్ ఆపేస్తారు.
3 దశలలో ఇండెక్స్ ఆధారిత సర్క్యూట్ బ్రేకర్ సిస్టమ్ వర్తిస్తుంది. ఇదిలా ఉంటే కరోనా దెబ్బకు దేశీయ విదేశీ పెట్టుబడి దారులు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకి రావడం లేదు. ముఖ్యంగా విదేశీ పెట్టుబడి దారులు భారీగా వెనక్కు తగ్గుతున్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోవడం కూడా స్టాక్ మార్కెట్ పై ప్రభావం చూపించింది. ఇప్పటికే ఆర్ధిక వ్యవస్థ కరోనా దెబ్బకు పతనం అవుతున్న తరుణంలో స్టాక్ మార్కెట్ దెబ్బ మరింతగా తగిలే అవకాశాలు కనపడుతున్నాయి.