దేశవ్యాప్తంగా ఉన్న వంటగ్యాస్ వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శుభవార్త చెప్పాయి. వరుసగా మూడో నెల కూడా వంట గ్యాస్ సిలిండర్ ధరలను పెంచలేదు. అక్టోబర్ నెలలోనూ ఎల్‌పీజీ సిలిండర్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీ తదితర ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎల్‌పీజీ సిలిండర్ల ధరలకు ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో గత నెలలో ఉన్న ధరలే ఈ నెలలోనూ కొనసాగనున్నాయి.
ఇక ఢిల్లీలో నాన్ సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.594 ఉండగా, ఇతర ప్రాంతాల్లోనూ దాదాపుగా ఇదే రేటుకు ఆ సిలిండర్ లభిస్తోంది. అయితే 19 కిలోల సిలిండర్ ధర పెరిగింది. ఐవోసీ వెబ్‌సైట్‌లో తెలిపిన ప్రకారం 19 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.32 పెరిగింది.
జూలైలో 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.4 పెరిగింది. జూన్‌లో నాన్ సబ్సిడీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.11.50 వరకు పెరిగింది. ఇక మేలో రూ.162.50 తక్కువకు సిలిండర్ లభించింది.
ఐవోసీ వెబ్‌సైట్‌లో తెలిపిన వివరాల ప్రకారం ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో 14.2 కిలోల నాన్ సబ్సిడీ సిలిండర్ ధర రూ.594 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ముంబైలోనూ అదే రేటు ఉంది. అలాగే చెన్నైలో రూ.610, కోల్‌కతాలో సిలిండర్ ధర రూ.620.50 గా ఉంది.
ఢిల్లీలో 19 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర గత నెలలో రూ.1133.50 ఉండగా అదిప్పుడు రూ.32 పెరిగి రూ.1166కు చేరుకుంది. అలాగే కోల్‌కతాలో 19 కిలోల సిలిండర్ ధర రూ.1196 ఉండగా రూ.24 పెరిగి రూ.1220కి చేరుకుంది. ముంబైలో రూ.1089 ఉండగా రూ.24.50 పెరిగి రూ.1113.50కు చేరుకుంది. అదేవిధంగా చెన్నైలో రూ.1250 ఉన్న 19 కిలోల సిలిండర్ ధర రూ.26 పెరిగి రూ.1276కు చేరుకుంది.