హైదరాబాద్: తెలంగాణలో పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి ఎన్నికైన తర్వాత హస్తం పార్టీ దూసుకుపోతోంది. కాంగ్రెస్ పునర్ వైభవం కోసం ఆ పార్టీ నేతలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తమ తమ నియోజవకర్గాల్లో పార్టీ నేతలు, కారకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఇతర పార్టీ నేతలకు కూడా గాలం వేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అసంతృప్తిగా ఉన్న వ్యక్తులను కూడా పార్టీ నేతలు బుజ్జగిస్తూ మళ్లీ తమ వైపు తిప్పుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ.. దుబ్బాకలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయిన బిగ్‌బాస్ కంటెస్టెంట్ కత్తి కార్తీకను కలిశారు. కాంగ్రెస్‌లోకి రావాలని ఆమెను ఆహ్వానించారు. దీంతో మధుయాష్కీ ఆహ్వానాన్ని కత్తి కార్తీక స్వీకరించారు. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు కత్తి కార్తీక సుముఖుత చూపినట్లు తెలుస్తోంది. త్వరలో కత్తి కార్తీక కాంగ్రెస్‌లో చేరతారని అంటున్నారు. రేవంత్ రెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది.