పాట్నాః ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే బీహార్ సీఎం నితీశ్ కుమార్.. తాజాగా సహనం కోల్పోయి మీడియాపై చిందులేశారు. ఏకంగా పాత్రికేయులనే మీరు ఎవరిపక్షం అంటూ ప్రశ్నించారు. వివరాల్లోకెళ్తే.. శుక్రవారం నాడు పాట్నాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం నితీష్ కుమార్ మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ పాత్రికేయుడు.. ఇండిగో ఎయిర్ లైన్స్ మేనేజర్ రూపేశ్ కుమార్ సింగ్ హత్య కు సంబంధించి పలు ప్రశ్నలు అడిగారు. దీంతో నితీష్ సహనం కోల్పోయి పాత్రికేయులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇండిగో మేనేజర్ రూపేశ్ కుమార్ సింగ్ తన నివాసం ముందు ఉండగా.. గుర్తుతెలియని ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి కాల్చి చంపారు. ఈ ఘటనాస్థలి రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసానికి దగ్గరగా ఉండటంతో సంచలనంగా మారింది. రాష్ట్రంలో శాంతిభద్రతలపై అనేక ప్రశ్నలు లేవనెత్తాయి. ఈ విషయంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ ఘటనకు సంబంధించి సదరు జర్నలిస్టు ప్రశ్నింగా.. నితీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు చేసేవన్నీ తప్పుడు ఆరోపణలనీ, ఏవైనా ఆధారాలు మీ వద్ద ఉంటే పోలీసులకు ఇచ్చి.. దర్యాప్తునకు వారికి సహకరించాలని సూచించారు.
ఇదివరకూ తమకంటే ముందు పాలించిన లాలు, రబ్రీ కాలంలో ఎన్ని నేరాలు జరిగాయో తెలియదా? ఎందుకు వాటిని హైలెట్ చేయడం లేదంటూ ప్రశ్నించారు. 2005 కంటే ముందు ఉన్నదానిలా ఉందా రాష్ట్ర పరిస్థితి? అంటూ చిందులేశారు. ఇదిలా ఉండగా, తాజా ఘటన నేపథ్యంలో సీఎం నితీష్ కుమార్ సర్వత్రా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్షాలతో పాటు మిత్రపక్షం బీజేపీ సైతం శాంతిభద్రతల విషయంపై బహింరంగంగానే విమర్శలు గుప్పించడం ఆయన తలనొప్పిగా మారింది.