దారుణం : నక్సలైట్ అనుకుని హోంగార్డ్ ని కాల్చి చంపిన పోలీసులు !

బీహార్ లో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. నక్సలైట్ అని భావించి యాభై రెండేళ్ల హోంగార్డు ని పోలీసు సిబ్బంది కాల్చిచంపారు. పోలీసుల వివరాల ప్రకారం బారియార్పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఒక పోలీస్ ఔట్ పోస్ట్ వద్ద అర్ధరాత్రి సమయంలో తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయి. అయితే ఇది నక్సల్స్ ఎటాక్ అనుభవించిన పోలీసు అధికారులు కాల్పులు వచ్చిన వైపు తుపాకులు ఎక్కుపెట్టారు. కొద్దిసేపటికి ఆ వ్యక్తిని కాల్చిచంపారు కూడా.

తీరా కాల్చిచంపాక దగ్గరికి వెళ్లి చూస్తే అతను పోలీసు హోంగార్డుగా తేలింది. అతను కొద్దిరోజులుగా మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడని అందువల్లే తుపాకి పేల్చి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోలీస్ ఔట్ పోస్ట్ వద్ద ఉన్న ఒక రూమ్ మీదకు ఎక్కి అతను గాల్లోకి కాల్పులు జరిపినట్టు పోలీసులు గుర్తించారు. కానీ నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో నక్సలైట్ ఎటాక్ చేశారు అని భావించిన పోలీసులు కాల్పులు వినిపించిన వైపు కాల్పులు జరిపారు. దీంతో హోం గార్డు అక్కడికక్కడే మృతి చెందాడు.