రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని అంటారు. ఇప్పు డు ఇదే తరహాలోనూ ఏపీలో అధికార పార్టీ-కేంద్రంలో అధికార పార్టీలు వ్యవహరిస్తున్నాయా? లేక ఇరు పార్టీల మధ్య మరింత గ్యాప్ పెరగనుందా? అనే కోణంలో చర్చ సాగుతోంది. దీనికి ప్రధాన కారణం.. కరడు గట్టిన బీజేపీ వాది,నరసాపురం మాజీ ఎంపీ గోకరాజు గంగరాజును వైసీపీలోకి చేర్చుకోవడమే!! ఆర్ ఎస్ ఎస్ మూలాలున్న అతి తక్కువ మంది ఏపీకి చెందిన సీనియర్ నేతల్లో గోకరాజు ఒకరు.
పైకి ఆయన నిరాడంబరంగా ఉన్నా.. ఆర్ ఎస్ ఎస్‌లో ఆయనకు మంచి పలుకుబడి ఉంది. అదేసమ యంలో బీజేపీలోని కీలక పెద్దల వద్ద చనువు కూడా సొంతం. అలాంటి నాయకుడు అనూహ్యంగా ఇప్పుడు బీజేపీని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. అది కూడా కుటుంబ సమేతంగా కావడం ఆశ్చర్యంతోపాటు ఆసక్తిగానూ మారింది. ఈ నేపథ్యంలో అసలు దీని వెనుక ఉన్న రీజనేంటి? ఇంత హఠాత్తుగా బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడిని జగన్ ఎందుకు తన వైపు తిప్పుకొంటున్నారు? అనే చర్చ సాగుతోంది.
వాస్తవానికి కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీతో ఘర్షణాత్మక వాతావరణం పెట్టుకునేందుకు వైసీపీ అధినేత జగన్ సిద్ధంగా లేరనే విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రయోజనాలు, కొంత తన కేసుల నేపథ్యంలో జగన్ కేంద్రంలోని బీజేపీతో సానుకూల దృక్ఫథంతోనే ఉంటారు. ఉన్నారు కూడా. అయితే, ఇప్పుడు గోకరాజు ను పార్టీలోకి తీసుకుంటే .. బీజేపీకి భారీ ఎదురు దెబ్బ ఖాయమనే వాదన బలంగా వినిపిస్తోంది.
ఇదే జరిగితే.. కేంద్రంలోని బీజేపీ పెద్దలతో జగన్ ఢీ అంటే ఢీ అనే పరిస్థితి ఎదురు కానుంది. ఇది ఇప్పుడున్న పరిస్థితిలో ఆయనకు వ్యక్తిగతంగాను, రాష్ట్ర అభివృద్ధికి కూడా చేటనేది వాస్తవం.
మరి ఇన్ని తెలిసి కూడా గోకరాజును జగన్ ఎందుకు ఆహ్వానించినట్టు? పోనీ ఆయనే వచ్చినా.. ఎందుకు చేర్చుకుంటున్నట్టు? పైగా ఎన్నికల సమయంలో దగ్గుబాటి పురందేశ్వరి వంటి వారు బీజేపీ నుంచి వైసీపీలోకి చేరాలని ప్రయత్నించారు. కానీ, ఆ సమయంలో జగన్ వారికి పక్కన పెట్టారు. బీజేపీ నుంచి ఎవరు వచ్చినా చేర్చుకునేది లేదని అనధికార ప్రచారం కూడా చేశారు. మరి ఇప్పుడు అనూహ్యంగా గోకరాజును పార్టీలోకి తీసుకోవడం వెనుక వెరం ఉందా? అంటే లేదనే మాట వినిపిస్తోంది. ఇది.. బీజేపీతో వ్యూహాత్మకంగా ముందుకు సాగాలనే ఆలోచనలో భాగంగానే జగన్ ఇలా చేస్తున్నారని అంటున్నారు.
ప్రస్తుతం గోకరాజు మనసంతా రాజ్యసభపై ఉంది. అయితే, బీజేపీ తరఫున చాలా మంది రాజ్యసభకు పోటీ ఉన్నారు. పైగా ఏపీలో కోటా లేదు. ఈ నేపథ్యంలోనే లెక్కకు మిక్కిలి కోటా దక్కుతున్న వైసీపీ నుంచి గోకరాజును రాజ్యసభకు పంపాలనే అంతర్గత ఒప్పందం ఈ రెండు పార్టీల మధ్య ఏమైనా జరిగిందా? అనే కోణంలోనూ వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బీజేపీతో మా నాయకుడు వైరం పెట్టుకునే సమస్యలేదు. వ్యూహాత్మకంగానే వెళ్తున్నారని అనిపిస్తోంది.. అంటూ.. గోకరాజు పరిణామంపై వైసీపీకి చెందిన కీలక నాయకుడు, ఆది నుంచి ఉన్న ఓ సీనియర్ నేత మీడియాతో నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. దీనిని బట్టి గోకరాజును చేర్చుకునేందుకు జరిగిన పరిణామాలు ఆసక్తిగా మారాయి. మరి ఏంజరుగుతుందో చూడాలి.