– వివిధ విశ్వవిద్యాలయాల్లోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని బీజేపీ డిమాండ్
– రాష్ట్ర గవర్నర్‌ను కలిసి వినతి పత్రాన్ని అందజేసిన కమళం నేతలు
హైదరాబాద్ః తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీ బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా బీజేపీ నేత మురళీధర రావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర విద్యారంగానికి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే రాష్ట్రంలో వివిధ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అన్ని వర్సిటీలకు వెంటనే వీసీలను నియమించాలని పేర్కొన్నారు. ఒక్క ఉస్మానియా యూనివర్సిటీలోనే 900 లకు పైగా ఖాళీ పోస్టులు ఉన్నాయని బీజేపీ నేత, ఎమ్మెల్సీ రామచందర్ రావు గుర్తుచేశారు.
ఈ నేపథ్యంలో మురళీధర రావు నేతృత్వంలోని బీజేపీ నేతల బృందం మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు, వీసీలను, పాలకమండళ్లను వెంటనే ఏర్పాటు చేయాలని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ వినతి పత్రం అందజేశారు. వీసీల నియామకానికి సంబంధించి తాము ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విషయాన్ని గవర్నర్‌కు వివరించారు. గవర్నర్‌ను కలిసిన బీజేపీ బృందంలో, మురళీధర రావు, లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డి లతో పాటు రాష్ట్ర బీజేపీ యూనిట్ ఇతర సభ్యులు ఉన్నారు.