సీనియర్ హీరోయిన్ ఖుష్బూ దశ మారిపోనుందా ? ఆమె కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన వెంటనే ఆమె పొలిటికల్ కెరీర్ సరికొత్తగా మారనుందా ? అంటే అవుననే వార్తలు తమిళనాట వినిపిస్తున్నాయి. దక్షిణాదిలో అన్ని రాష్ట్రాల్లో ఎదిగేందుకు బీజేపీ అవకాశం ఉన్న ప్రతి ఛాన్స్‌ను వాడుకుంటోంది. ఇప్పటికే కర్నాటకలో పాగా వేసిన బీజేపీ మరోవైపు తెలంగాణను బాగా టార్గెట్‌గా చేసుకుంటోంది. ఆ తర్వాత ఏపీ, తెలంగాణతో పాటు కేరళపై కూడా ప్రధానంగా కాన్‌సంట్రేషన్ చేస్తోంది.
మిగిలిన రాష్ట్రాల్లో ఎలా ఉన్నా ప్రాంతీయ వాదం బలంగా ఉన్న తమిళనాడులో మాత్రం బీజేపీకి పట్టు చిక్కడం లేదు. 2014 ఎన్నికల్లో నాగర్‌కోవిల్ సీటు గెలుచుకున్న బీజేపీ గత ఎన్నికల్లో సున్నాతో సరిపెట్టుకుంది. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్నా బీజేపీకి ఉపయోగం లేకుండా పోయింది. రేపటి వేళ అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి వెళ్లినా ఉపయోగం ఉండదనే అంటున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడు ఎదిగేందుకు ఏ చిన్న వీలున్నా ఉపయోగించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది.
ఇటీవల పార్టీలో చేరిన ఖుష్బూకు బీజేపీ రాజ్యసభ పదవి ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సమ్మర్‌లో కర్నాటక నుంచి బీజేపీ నాలుగు రాజ్యసభ స్థానాలు దక్కించుకుంది. ఈ ఎన్నికల్లో గెలిచిన రాయచూర్‌కు చెందిన అశోక్ గస్తీ కరోనాతో మృతి చెందాడు. రాజ్యసభకు ఎంపికైన మూడు నెలలకే ఆయన కరోనాతో మృతి చెందడంతో ఇప్పుడు ఆ స్తానానికి వచ్చే నెలలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానం నుంచి బీజేపీ ఖుష్బూను రంగంలోకి దింపనుందని తెలుస్తోంది.
వచ్చే యేడాది మధ్యలోనే తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఖుష్బూకు రాజ్యసభ సీటు ఇస్తే ఆమె రాష్ట్ర వ్యాప్తంగా మరింత యాక్టివ్ అయ్యేందుకు ఉపయోగపడడంతో పాటు సినిమా వాళ్లను కూడా బీజేపీ వైపు ఆకర్షించేందుకు ఉపయోగపడుతుందని బీజేపీ అంచనా వేస్తోంది. వాస్తవంగా ఖుష్బూ తమిళనాడు అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆమెను అసెంబ్లీకి పోటీ చేయించేందుకు బీజేపీకి ఇష్టంలేకనే… ఆమెను రాజ్యసభకు పంపితే ఆమెపై ఒత్తిడి ఉండదని… అప్పుడు ఆమె ఎన్నికల్లో స్వేచ్ఛగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసే వీలుంటుందని బీజేపీ ప్లాన్ చేస్తోంది.