కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన విజయాలను కొని యాడుతూ.. రాష్ట్ర బీజేపీ నాయకులు వారోత్సవాలకు పిలుపునిచ్చారు. ఇంటింటికీ.. కరపత్రాలు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు. అంటే.. మోడీ విజయాలను సాగదీసి.. ప్రజలకు వివరించేందుకు పూను కున్నారు. మరి అదే సమయంలో ఏపీలో బీజేపీ సాధించిన ఘనకార్యాలపైనా ఓ నిఘంటువు వేస్తే.. బా గుంటుంది కదా? అంటున్నారు పరిశీలకులు. రాష్ట్రంలో ప్రజలను వీడి రాజకీయ సాము చేస్తున్న బీజేపీ కూడా తన ను తాను విశ్లేషించుకుంటే బెటరని అంటున్నారు.
ఏపీలో ఏడాది కాలంగా.. బీజేపీ ప్రజల పక్షాననిలిచిన ఒక్క కార్యక్రమం కూడా లేదనేది విశ్లేషకుల మాట. అంతేకాదు, రాజకీయంగా అధికార పక్షంపై విమర్శలు చేయడానికే బీజేపీ సమయం వెచ్చించింది కానీ, ఎక్కడా తనకంటూ.. ప్రత్యేక ఓటు బ్యాంకును కానీ, కార్యకర్తలను కానీ ఏర్పాటు చేసుకునేందుకు ప్రయ త్నించలేదు. రాజధాని విషయంలోనూ ముందు ఆర్భాటంగా మేమున్నాం.. ప్రధాని ఉన్నారు.. ఇంక అమరావతి కదలదని రాష్ట్ర బీజేపీ నేతలు చెప్పుకొచ్చారు. దీంతో అక్కడి ప్రజలు ఆశలు పెంచుకున్నా రు. తీరా ఈ విషయంపై కేంద్రం.. పార్లమెంటు సాక్షిగా.. తమకు సంబంధం లేదని కుండబద్దలు కొట్టింది.
ఇక, విశాఖ ఎల్జీ పాలిమర్స్ విషయంలోనూ ముందు దూకుడుగా వ్యవహరించిన రాష్ట్ర బీజేపీ నేతలు.. ఏకంగా స్పాట్ కు కూడా వెళ్లి.. అక్కడిబాధితులను పరామర్శించి.. ప్రభుత్వంపై విమర్శలు, సీఎంకు చీవాట్లు పెట్టారు. దీంతో అక్కడి బాధితులు పెద్ద ఎత్తున బీజేపీపై ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఇంతలో ఏం జరిగిందో ఏమో.. బీజేపీ ఈ విషయంలో సైలెంట్ అయిపోయింది. ఈ కంపెనీకి పర్యావరణ అనుమతుల నుంచి కార్యకలాపాలనిర్వహణ వరకు అన్నీ..కేంద్రం నుంచి వచ్చాయి. ఈ క్రమంలో ఏం మాట్లాడినా.. ఇబ్బందే! అనే కోణంలో బీజేపీ నేతలు మౌనం పాటించారు. ఇలా అన్ని సమస్యల్లోనూ బీజేపీ విఫలమైంది. ఈ విషయాలపై కూడా సంబరాలు చేసుకుంటే బెటర్ కదా ? అంటున్నారు పరిశీలకులు.