తెలంగాణలో ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. ఆయా పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించేందుకు కుస్తీపడుతున్నాయి. అయితే.. బీజేపీ మూడో జాబితాపై కసరత్తు మొదలు పెట్టింది. 52 మందితో ఈ నెల 21న జాబితా విడుదల చేసిన బీజేపీ.. నిన్న మహబూబ్ నగర్ సెగ్మెంట్ కు ఏపీ మిథున్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటిస్తూ రెండో జాబితాను విడుదల చేసింది. ఇంకా 66 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఇందులో పొత్తులో భాగంగా జనసేనకు 10–12 స్థానాలు కేటాయించే అవకాశం ఉంది. మిగతా సెగ్మెంట్లకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఇవాళ కాచిగూడలోని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి నివాసంలో ప్రకాశ్ జవదేకర్, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ సమావేశమయ్యారు.
భేటీ అయ్యారు. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలోని సీట్లపై చర్చ జరిగినట్టు సమాచారం. కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో టికెట్ల కోసం పోటీ తీవ్రంగా ఉంది. ఒక్కో సీటు కోసం ఇద్దరి నుంచి నలుగురు పోటీ పడుతున్నారు. వారిలో గెలుపు అవకాశాలున్న అభ్యర్థి ఎవరు? ఎవరికి టికెట్ కేటాయించాలన్న అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. సికింద్రాబాద్ నుంచి సారంగపాణి, బండ కార్తీక టికెట్ ఆశిస్తున్నారు. శేరిలింగంపల్లి సెగ్మెంట్ నుంచి యోగానంద్ టికెట్ ఆశిస్తుండగా.. ఈ సీటు పొత్తులో భాగంగా జనసేనకు వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కూకట్ పల్లి, జూబ్లీహిల్స్ లో దీపక్ రెడ్డి ప్రయత్నాలు చేస్తుంటే డాక్టర్ వీరపనేని పద్మ కూడా రేసులో ఉన్నారు.