రాజస్థాన్ రాజకీయ సంక్షోభంపై బీజేపీ విమర్శల బాణాలు ఎక్కుపెట్టింది. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు అశోక్ గహ్లోత్ ప్రకటించిన తరుణంలో తన విమర్శలకు మరింత పదును పెట్టింది బీజేపీ. గహ్లోత్‌ను సంపూర్ణ రాజకీయనాయకుడిగా అభివర్ణిస్తూ.. ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడానికి ‘రబ్బరు స్టాంపు’ పదవిని వదులుకున్నారని ఎద్దేవా చేసింది. మరోవైపు సీఎం కుర్చీని ఆశించిన సచిన్ పైలట్‌కు పార్టీ అధిష్ఠానం మళ్లీ ‘చెక్’ పెట్టిందని బీజేపీ ఐటీ సెల్ కన్వీనర్ అమిత్ మాలవీయ ఎద్దేవా చేశారు.
గతంలో డిప్యూటీ సీఎంగా చేసిన సచిన్‌పైలట్‌కు ముఖ్యమంత్రి అయ్యే దారులు మూసుకుపోయాయని, ఆయన సీఎం కావాలనుకుంటే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌పై తిరుగుబావుటా ఎగరేసి తన బలాన్ని నిరూపించుకోవాలని, అధినేత్రి సోనియా గాంధీ చుట్టూ ఏర్పడిన కనిపించని పొరను తొలగించాలన్నారు. ఆయన మాటలకు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మద్దతు తెలిపారు.
’’రబ్బరు స్టాంప్‌గా వ్యవహరించే అధ్యక్షుడి కోసం గాంధీ కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు. దీనికి గహ్లోత్ ఏ విధంగానూ సరిపోరు. అందుకే ఆయన వెళ్లిపోయారు’’ అంటూ రాసుకొచ్చారు. కాంగ్రెస్ నిర్వహించబోయేవి అధ్యక్ష ఎన్నికలు కావని, కేవలం రబ్బరు స్టాంపు కోసం జరుగుతున్న ఎన్నికలని ఆయన ఎద్దేవా చేశారు.