ఇప్పుడు తెలంగాణలో ఇద్దరు మంత్రులు హాట్ టాపిక్ గా మారారు. ఒకరు గంగుల కమలాకర్. మరొకరు పువ్వాడ అజయ్ కుమార్. రెండు వేర్వేరు వివాదాల్లో ఈ ఇద్దరినీ బీజేపీ టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయని జోరుగా చర్చ నడుస్తోంది. గులాబీ గడ్డ కరీంనగర్ నుంచి బండి సంజయ్ ఎంపీగా గెలువడంతోనే రెండు పార్టీల మధ్య పోరు ప్రారంభమైంది. కరీంనగర్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టిన గంగుల కమలాకర్ కు ఇది పక్కలో బల్లె వంటిదే. వీరిద్దరూ ఒకటే కులానికి చెందిన వారయినప్పటికీ.. ప్రత్యర్థుల కంటే శత్రువులుగానే ఉంటారు. వారిద్దరి మధ్య ఘాటైన మాటల తూటాలు పేలుతుంటాయి. వారి మధ్యేకాదు క్యాడర్ కూడా ఢీ అంటే ఢీ అనే పరిస్థితి.
ఈ సందర్భంలో గంగుల కుటుంబసభ్యులకు చెందిన మైనింగ్ కంపెనీలపై నెలకొన్న వివాదాలు చిక్కులను తెచ్చిపెడుతున్నాయి. పలు అంశాల్లో ఈ కంపెనీలపై సీబీఐ దర్యాప్తు కూడా జరుగుతోంది. తాజాగా గంగుల కుటుంబానికి చెందిన కంపెనీతో పాటు ఈ జిల్లాలోని మరో ఏడు కంపెనీలపై ఎన్జీటీకి ఫిర్యాదులు అందాయి. ఎన్నికల సమయానికి ఈ రెండు వివాదాలను బీజేపీ ముఖ్యంగా బండి సంజయ్ తన ఆయుధాలుగా మార్చుకునే అవకాశాలు ఉన్నాయి.
సీబీఐ గురించి తెలిసిందే కదా. వీటినన్నింటిని గమనించే గంగుల కొద్దికాలంగా సైలెంట్ గా ఉంటున్నారని జిల్లా వాసులు అంటున్నారు. ముఖ్యంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత సైడ్ లైన్ అయ్యారని చెబుతున్నారు. బీజేపీ మరింత దూకుడుగా వెళ్తే…ఎన్నికల నాటికి గంగుల మరింతగా డిఫెన్స్ లో పడొచ్చునని అంటున్నారు. మొత్తంగా బీజేపీ చక్రబంధంలో గంగుల చిక్కకున్నారని, సీబీఐ ఆయుధాన్ని ఎప్పుడైనా ప్రయోగించి ముకుతాడు వేయడం గ్యారంటీ అని చర్చించుకుంటున్నారు.
ఇక మరో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. బీజేపీ కార్యకర్త సాయి గణేశ్ ఆత్మహత్య వ్యవహారం ఆయన మెడకు చుట్టుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఏకంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తోపాటు బీజేపీ నేతలు కూడా రంగంలోకి దిగారు. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేయడం అంటేనే విషయం బోధపడుతోంది. తమ కార్యకర్తల జోలికి వస్తే ఊరికునేదిలేదనే గట్టి హెచ్చరిక పంపేందుకు హైకోర్టుకు వెళ్లినట్లుగా కనిపిస్తోంది. న్యాయస్థానం ఆదేశాల మేరకు తదుపరి కార్యాచరణ ఉండే అవకాశాలు ఉన్నా..పువ్వాడ ఇప్పటికే బీజేపీ టార్గెట్ గా ఉన్నారు.
కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే పువ్వాడ కీలక పాత్ర అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇది గుర్తించే ప్రతిపక్షాలు, ముఖ్యంగా బీజేపీ నేతలు ఆయన్ను టార్గెట్ చేస్తున్నారని టీఆర్ఎస్ శ్రేణులు పేర్కొంటున్నాయి. తాము అధికారంలోకి వస్తే మొదట సంగతి చూసేది నీ పనే అని బండి సంజయ్ గతంలోనే ఒకసారి హెచ్చరించారు. సాయిగణేశ్ ఆత్మహత్య వ్యవహారంలో పువ్వాడ టార్గెట్ గా బీజేపీ పావులు కదుపుతోంది. మొత్తంగా చూస్తే ఈ ఇద్దరు మంత్రులకు భవిష్యత్తులో చిక్కులు తప్పవని టాక్ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.