మరి కొన్ని నెలల్లో దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి.ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు జాబితాను విడుదల చేస్తున్నా సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తున్న బీజేపీ లోక్సభ ఎన్నికల అభ్యర్థుల ప్రకటనలో దూకుడు కొనసాగిస్తోంది.కొన్ని రోజుల క్రితమే లోక్ సభ ఎన్నికలకు తొలి జాబితాను ప్రకటించింది.16 రాష్ట్రాల్లోని 195 మంది అభ్యర్థులతో కూడిన లిస్టును బీజేపీ విడుదల చేసింది.
ఇక తొలి జాబితాను విడుదల చేసిన ఆ పార్టీ.. ఈనెల 11న రెండో జాబితా వెలువరించనుంది. ఇందులో తెలంగాణకు చెందిన 6 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఇక్కడ ఇప్పటికే 9 మంది పేర్లను కమలం పార్టీ ప్రకటించింది. ఇక ఈనెల 13న పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ రానున్నట్లు తెలుస్తోంది.దీంతో ఎన్నికల తేదీని ప్రకటించడానికి ముందే ప్రచారానికి సన్నద్ధమయ్యేలా అధిష్ఠానం ప్లాన్ చేస్తోంది. ఇటీవల రాజస్థాన్, మధ్య ప్రదేశ్,ఛత్తీస్ ఘడ్ ఇలాగే ఈసీ ప్రకటనకు ముందే అభ్యర్థులను ప్రకటించి, ప్రత్యర్థుల కంటే ముందే ప్రచారం మొదలు పెట్టింది. అది మంచి ఫలితాలు ఇవ్వడంతో మరోసారి అదే ప్లాన్ అమలు చేయాలని బీజేపీ చూస్తోంది.