జీహెచ్ఎంసీ పాలకవర్గం ఏర్పాటు పై బీజేపీ కొత్త ప్యూహం

-

గ్రేటర్ హైదరాబాద్‌ కొత్త పాలకవర్గం ఇప్పట్లో కొలువు తీరేలా కనిపించడం లేదు. గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వచ్చి 15రోజులు దాటింది. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లకు రిటర్నింగ్ అధికారులు సర్టిఫికెట్ లు కూడా జారీ చేశారు. అయితే వారి ఎన్నికను అధికారికంగా ప్రకటిస్తూ.. ఈసీ ఇంకా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. కొత్త గా ఎన్నికైనవారి రిపోర్ట్‌ను కూడా ప్రభుత్వానికి పంపలేదు. దీంతో కొత్తగా ఎన్నికైనా కార్పొరేటర్లు.. పాలకవర్గం కొలువుదీరేదెప్పుడా అని ఎదురు చూస్తున్నారు…

గ్రేటర్ గెలుపు ఇచ్చిన కిక్ తో ఇప్పటికే దూకుడు మీదున్న బీజేపీ.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. వెంటనే కొత్త పాలక వర్గాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఎన్నికల సంఘాన్ని కలిసి.. గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరింది. టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినట్టు ఎస్‌ఈసీ వ్యవహరిస్తోందని ఎదురుదాడి మొదలెట్టింది.

ఎన్నికల సంఘాన్ని కలిసిన బీజేపీ నేతలు వెంటనే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అదేశాలకు అనుగుణంగా ఎస్‌ఈసీ పని చేస్తోందని ఆరోపించారు. ప్రస్తుత పాలక వర్గానికి ఇంకా టైం ఉందని చెబుతున్న ఈసీ.. ముందస్తు ఎన్నికలు ఎందుకు నిర్వహించిందో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. 24 గంటల్లో ఎన్నికల సంఘం స్పందించకపోతే ప్రజా పోరాటం చేస్తామని హెచ్చరించారు బీజేపీ నేతలు.

ఎన్నికల సంఘం మాత్రం సంక్రాంతి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపించడం లేదు. ఆ తర్వాతే.. ప్రభుత్వ సూచనతో కొత్త పాలక వర్గం ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉందని ఈసీ వర్గాల సమాచారం. ముప్పేట దాడితో స్పీడ్ పెంచిన కమల దళం మరిన్ని కొత్త ప్యూహాలతో ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేలా ప్యూహాలు సిద్దం చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news