హైదరాబాద్: కరోనాతో పోరాడి భయటపడ్డామనుకున్న బాధితులకు బ్లాక్ ఫంగస్ భయం పట్టుకుంది. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ బాధితులు పెరిగారు. ఇందుకు కారణం ముక్కు సమస్యలేనని ఈఎన్‌టీ వైద్యులు చెబుతున్నారు. సైనస్ ఉన్న వాళ్లే బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారని, ప్రత్యేక చికిత్స చేయాల్సి వస్తుందని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ 400 మందికి పైగా బ్లాక్ ఫంగస్ కేసులను గుర్తించారు. దీంతో రెండు ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈఎన్‌టీ వైద్యులతో వీరికి ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నాయి. కానీ బ్లాక్ ఫంగస్ బాధితులు ఘననీయంగా పెరుగుతుండటం వైద్యులకు సవాల్‌గా మారింది. బ్లాక్ ఫంగస్ సోకిన వారిలో ముఖ్యంగా ముక్కు, సైనస్‌లో ఉన్నప్పుడే సర్జరీ చేసి తొలగించాలని చెబుతున్నారు. కన్ను, మెదడుకు ఈ ఫంగస్ చేరితే ప్రమాదం ఉంటుందని వెల్లడించారు.
తెలంగాణలో ఇప్పటివరకూ 351 బ్లాక్ ఫంగస్ కేసులను గుర్తించారు. వీరందరికి హైదరాబాద్ కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రతిరోజు 200-300 మంది బ్లాక్ ఫంగస్ అనుమానితులు ఆస్పత్రికి వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. గురువారం 30 రోగులకు శస్త్ర చికిత్స చేశామని తెలిపారు.
అటు ఏపీలోనూ బ్లాక్ ఫంగస్ కేసులు కలవర పెడుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలో 81 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అయ్యాయి. ఒంగోలు రిమ్స్‌లో 55 మంది బ్లాక్ ఫంగస్ బాధితులు చికిత్స పొందుతున్నారు. జిల్లాలో ఇప్పటికే 13 మంది మృతి చెందగా…11 మందికి రిమ్స్ వైద్యులు ఆపరేషన్లు చేశారు