తుమ్మితే ఊడిపోయే ముక్కు మాదిరిగా తయారైన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు రాజకీయ ఆసక్తిగా మారింది. తనకు తిరుగులేదని, తనకు ఎదురు లేదని భావించిన బొండా.. రాజకీయాల్లో లేటుగా వచ్చినా.. లేటెస్టు డైలాగులు, దూకుడుతో దూసుకుపోయారు. 2009లోనే తూర్పు నియోజకవర్గం టికెట్‌ను ఆశించినా భంగపడ్డారు. ఈ క్రమంలో పట్టుబట్టి 2014లో సెంట్రల్ టికెట్ సంపాయించుకున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమా, విజయవాడ ఎంపీ కేశినేని నానిల వర్గంలో కీలక నేతగా ఎదిగిన ఆయన చంద్రబాబు నుంచి టికెట్ దక్కించుకుని భారీ మెజారిటీతో విజయం సాధించారు.
అయితే, 2014లో వైసీపీ చేసిన పొరపాటు కారణంగా ఇక్కడ నుంచి పెద్దగా పరిచయం లేని పూనూరు గౌతం రెడ్డికి టికెట్ ఇవ్వడంతో బొండా ఉమా గెలుపు సాధ్యమైందనే ప్రచారం ఉంది. ఇదిలావుంటే.. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లపాటు బొండా ఉమా చెలరేగిపోయారు. ఇటు నియోజకవర్గంలోనూ,, అటు అసెంబ్లీలోనూ మరోపక్క పార్టీలోనూ తనదే హవా అన్నట్టుగా ఆయన చెలరేగిపోయారు. ఒకానొక దశలో ఫైర్ బ్రాండ్ ఇమేజ్‌ను కూడా సొంతం చేసుకునేందుకు ప్రయత్నించారు. అసెంబ్లీలో అరెయ్ , ఒరేయ్ అంటూ విజృంభించారు. వైసీపీ నేతలపైనా, పార్టీ అధినేత జగన్‌పైనా ఒంటికాలిపై విరుచుకుపడ్డారు. అదేసమయంలో ఆయన అనేక వివాదాల్లో కూరుకుపోయారు.
భూకబ్జాలు, బెదిరింపులకు సంబంధించి బొండా సతీమణిపైనా, బొండాపైనా కేసులు నమోదయ్యే వరకు పరిస్థితి వచ్చింది. ఇక, తాజా ఎన్నికల సమయంలో ఓ వర్గాన్ని అవమానించిన విషయం ఎన్నికలకు ముందు కలవరపాటుకు గురి చేసింది. చంద్రబాబు మంత్రి వర్గంలో బెర్త్‌ను ఆశించి భంగ పడడం మరో కొసమెరుపు. కాపు సామాజిక వర్గానికి చెందిన బొండా అత్యంత స్వల్ప ఓట్ల తేడాతో(25) ఓటమిపాలయ్యారు. అయితే, ఓడిన తర్వాత నుంచి ఆయన పార్టీ మారతారనే ప్రచారం ఊపందుకుంది. కొన్నాళ్ల కిందట కాపు సామాజిక వర్గం ప్రత్యేకంగా భేటీ అయిన సందర్భంగా ఆయన హాజరై.. చంద్రబాబు కాపులకు ఏమీ చేయలేదని,బాబు వ్యూహాన్ని బట్టి .. తన అడుగులు ఉంటాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే, ఇప్పటి వరకు బొండా ఎటు వెళ్తారు? పార్టీలోనే ఉంటారా? లేక సొంత అజెండాతో ముందుకు వెళ్తారా? అనేది సస్పెన్స్ గానే ఉంది. ఇదిలావుంటే, సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ శ్రేణులను తాజాగా విజయం సాధించిన వైసీపీ నాయకుడు, సీనియర్ నేత మల్లాది విష్ణు.. తనవైపు తిప్పుకొనే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు గందరగోళంలో పడ్డాయి. తమను నడిపించేదెవరు? అంటూ ఎదురు చూస్తున్నారు. మరి చంద్రబాబు కీలకమైన బెజవాడలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.