అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలోనే పోలీసులు రాష్ట్రంలో, సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. తాజాగా ఈ తనిఖీల్లో బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌కు చెందిన కారులో వెండి వస్తువులను అధికారులు సీజ్ చేశారు.
కర్ణాటకలోని దావణగెరె శివారులో గల హెబ్బళు టోల్ సమీపంలో ఈసీ అధికారులు తనిఖీలు చేస్తుండగా ఓ బీఎండబ్ల్యూ కారులో భారీగా వెండి వస్తువులను గుర్తించారు. ఐదు బాక్సుల్లో చెన్నై నుంచి ముంబయి తరలిస్తున్న ఈ వస్తువులకు సరైన పత్రాలు చూపించలేదు. అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 66 కేజీల వెండి గిన్నెలు, స్పూన్లు, ప్లేట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.39లక్షల పైనే ఉంటుందని పేర్కొన్నారు.
దీనిపై కారు డ్రైవర్ సుల్తాన్ ఖాన్, వాహనంలో ఉన్న మరో వ్యక్తి హరి సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. దర్యాప్తులో ఈ కారు బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌కు చెందిన బేవ్యూ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థపై రిజిస్టరై ఉన్నట్లు తెలిసిందని పోలీసులు వెల్లడించారు.