ఇటీవల తరచూ తెరాసలో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే ఖమ్మం, పాలమూరు, వరంగల్ లలో అంతర్గత విభేదాలు బయటకు వచ్చాయి. ఆయా నేతలు బహిరంగంగానే ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా నల్గొండలోనూ అంతర్గత విభేదాలు మొదలైనట్లు కనిపిస్తోంది. మంత్రి జగదీశ్ రెడ్డిపై మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ చేసిన వ్యాఖ్యలు చూస్తే నిజమేననిపిస్తోంది.
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసినప్పటి నుంచి మునుగోడు నియోజకవర్గంలో తెరాస చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించి తనకు, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌కు ఎవరూ సమాచారం ఇవ్వడం లేదని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పేర్కొన్నారు. ఇక్కడ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి దీనికి సమాధానం చెప్పాలని కోరారు. బీసీ సామాజికవర్గం బలంగా ఉన్న మునుగోడులో ఆ వర్గం నేతలను కలుపుకొని పోవాల్సి ఉండగా.. ఇలా వ్యవహరించడమేంటని ప్రశ్నించారు.
అభ్యర్థి ఎవరైనా తెరాసదే విజయమని సర్వేలు చెబుతున్నాయని మాజీ ఎంపీ అన్నారు. ఇతర పార్టీల్లా తెరాసలో లాబీయింగ్‌కు తావుండదని.. అంతిమ నిర్ణయం కేసీఆర్‌దేనని, ఆయన చెప్పిన విధంగా పనిచేస్తామని స్పష్టంచేశారు. బీసీ సామాజికవర్గం బలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో టికెట్ ఆశించడంలో తప్పేముందని ప్రశ్నించారు. పదవులు ఉన్నా.. లేకున్నా.. ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తున్నానని చెప్పారు.