తెలంగాణ ఉపాధ్యాయులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చదువుతోపాటు సంస్కారాన్ని నేర్పుతూ.. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గురుతర బాధ్యతను ఉపాధ్యాయులు నిర్వర్తిస్తున్నారని సీఎం అన్నారు. ‘సమాజాభివృద్ధికి విద్యే మూలం’ అన్న మహనీయుల స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న గురుకుల విద్య దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల సంక్షేమం, విద్యాభివృద్ధి కోసం చేపట్టిన కార్యాచరణ సత్ఫలితాలనిస్తోందన్నారు.
ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తున్నారని, వారిని అందరం గౌరవిద్దామని గవర్నర్ సూచించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలంగాణ టీచర్లకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ విద్యార్థులను దేశంలోనే నంబర్ వన్ గా నిలిపేందుకు వారు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. తల్లిదండ్రులు మొదటి గురువులు కాబట్టి.. ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని వారికి కూడా మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులంతా తమ టీచర్లను గౌరవిస్తూ వారు చూపిన బాటలో నడవాలని సూచించారు. టీచర్ల సాయంతో నేటి బాలలు రేపటి పౌరులుగా మారి నవభారత నిర్మాణంలో పాలుపంచుకోవాలని కోరారు.