కోతులకు భయపడి పరిగెత్తి.. బోరుబావిలో పడ్డ బాలుడు

-

మధ్యప్రదేశ్​లో కోతులకు భయపడి పరిగెత్తుతూ ఏడేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు 60 అడుగుల బోరు బావిలో పడిపోయాడు. మంగళవారం రోజున జరిగిన ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది.. సహాయక చర్యలు ప్రారంభించారు.

విదిశా జిల్లాలోని లటేరీ ప్రాంతంలోని ఆనంద్​పుర్​ గ్రామానికి చెందిన లోకేశ్​ అహిర్వార్​ ప్రమాదవశాత్తు 60 అడుగుల బోరు బావిలో పడిపోయాడు. మంగళవారం ఉదయం లోకేశ్​ తోటి స్నేహితులతో కలిసి పొలాల్లో ఆడుకోవడానికి వెళ్లాడు. వారు అడుకుంటుండగా అక్కడికి కోతుల గుంపు వచ్చింది. వాటిని చూసి చిన్నారులంతా పరిగెత్తారు. ఈ క్రమంలో లోకేశ్ కూడా పరిగెడుతూ పొలంలో తెరచి ఉన్న.. 2 అడుగుల వెడల్పు, 60 అడుగుల లోతైన ఓ బోరు బావిలో పడిపోయాడు.

గమనించిన స్నేహితులు గ్రామస్థులు తెలపగా లోకేశ్ తల్లిదండ్రులతో సహా వారంతా అక్కడికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందించగా వారితో పాటు మూడు ఎస్​డీఆర్​ఎఫ్ బృందాలు, ఓ​ ఎన్​డీఆర్​ఎఫ్ బృందం అక్కడికి చేరుకుని లోపల ఉన్న చిన్నారి కోసం పైపుల ద్వారా ఆక్సిజన్​ను సరఫరా చేశారు. లోకేశ్ కదలికలను గమనించడానికి సీసీటీవీని లోపలికి పంపించి మాట్లాడే ప్రయాత్నాలు కూడా చేశారు.

ప్రస్తుతం ఆ బాలుడు దాదాపు 43 అడుగుల లోతులో చిక్కుకుపోయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. చిన్నారిని రక్షించేందుకు 5 జేసీబీలతో తవ్వడం ప్రారంభించగా ప్రస్తుతం 40 అడుగుల లోతు వరకు తవ్వగలిగారు. త్వరలోనే బాలుడ్ని కాపాడుతామని ఎన్​డీఆర్​ఎఫ్​ డిప్యూటీ కమాండర్​ అనీల్​ పాల్​ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news