‘బాయ్‌కాట్‌ లైగర్‌’ Vs ‘సపోర్ట్‌ దేవరకొండ’.. ఏమిటీ వివాదం?

-

బాయ్‌కాట్‌ ట్రెండ్‌ గత కొంతకాలంగా బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమను కుదిపేస్తోన్న విషయం తెలిసిందే. బీటౌన్‌ ఖాన్‌, కపూర్‌ నటీనటుల సినిమాలు విడుదలైన ప్రతి సారీ వాటిని బాయ్‌కాట్‌ చేయాలంటూ నెటిజన్లు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆయా నటీనటులు, దర్శక నిర్మాతలు గతంలో ఓ మతానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు, నెపోటిజం.. ఇలాంటి అంశాలు ట్యాగ్‌ చేస్తూ వాళ్ల సినిమాలు నిషేధిస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఈ ట్రెండ్‌ కారణంగా ఇప్పటికే బాలీవుడ్‌ బడా హీరో ఆమిర్‌ఖాన్‌ నటించిన లాల్‌ సింగ్‌ చడ్డా ఎంతగానో నష్టపోయింది.

విజయ్ దేవరకొండ

ఇప్పుడు ఇదే ఉచ్చులో విజయ్‌ దేవరకొండ లైగర్‌ చిక్కుకుంది. లైగర్‌ని బాయ్‌కాట్‌ చేయాలంటూ ఓవైపు పలువురు నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. మరోవైపు ఎలాంటి సపోర్ట్‌ లేకుండానే విజయ్‌ ఈస్థాయికి వచ్చారని.. ఆయనకెప్పుడూ తమ సపోర్ట్‌ ఉంటుందని అభిమానులు పేర్కొంటున్నారు.

ఎందుకీ వివాదం… లైగర్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ బాలీవుడ్‌ మీడియాకు శుక్రవారం విజయ్‌ దేవరకొండ ఇంటర్వ్యూ ఇచ్చారు. బాయ్‌కాట్‌ ట్రెండ్‌పై స్పందించాలని కోరగా.. సినిమా నిర్మాణం గురించి ఒక్కసారి ఆలోచిస్తే.. నటీనటులు, దర్శకుడు, నిర్మాత, ఇతర సహాయనటులు ఇలా సుమారు 300 మంది ఒక ప్రాజెక్ట్‌ కోసం పనిచేస్తారు. వాళ్లందరికీ ఎంతోమంది సిబ్బంది ఉంటారు. కాబట్టి ఒక సినిమా మాలాంటి వారికి ఉద్యోగాన్ని ఇస్తుంటే మరెంతోమందికి జీవనోపాధిని అందిస్తోంది.

లాల్ సింగ్ చడ్డా
లాల్ సింగ్ చడ్డా

ఉదాహరణకు ఆమిర్‌ నటించిన లాల్‌ సింగ్‌ చడ్డాని తీసుకోండి. దీన్ని ఆమిర్‌ నటించిన చిత్రంగా చెప్పుకొంటున్నాం. కానీ.. ఆ సినిమాపై సుమారు 3000 మంది కుటుంబాలు జీవనోపాధి పొందాయి. మీరు ఈ చిత్రాన్ని బాయ్‌కాట్‌ చేయడం వల్ల ఆమిర్‌కు నష్టం ఉండదని, ఆ సినిమాపై జీవనోపాధి పొందుతున్న వేలమందిని ఇబ్బందిపెడుతున్నారని తెలుసుకోవాలి. ఎంతోమంది సినీ ప్రియుల్ని థియేటర్లకు రప్పించిన నటుడు ఆమిర్‌. బాయ్‌కాట్‌ ఎందుకు జరిగిందనేది నాకు పూర్తిగా తెలియదు. కానీ.. అపార్థాలే దీనికి కారణమై ఉండొచ్చు. దయచేసి ఇకనైనా తెలుసుకోండి.. బాయ్‌కాట్‌తో మీరు ఆమిర్‌ ఒక్కడినే ఇబ్బందిపెట్టడం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థను ఇబ్బందిపెడుతున్నారు’’ అని విజయ్‌ చెప్పుకొచ్చారు.

లైగర్
లైగర్

సోషల్ మీడియోలో ఇలా… లాల్‌ సింగ్‌ చడ్డాపై విజయ్‌ స్పందించడం కొంతమంది నెటిజన్లకు నచ్చలేదు. దీంతో విజయ్‌ నటిస్తోన్న లైగర్‌కు వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో వరుస పోస్టులు పెడుతున్నారు. ఈ చిత్రానికి కరణ్‌ జోహార్‌ నిర్మాతగా ఉండటం వల్ల కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నామంటూ ‘బాయ్‌కాట్‌ లైగర్‌’ ట్యాగ్‌ జతచేస్తూ పలువురు నెటిజన్లు ట్వీట్స్‌ చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌ ప్రెస్‌మీట్‌ వివాదానికి సంబంధించిన ఫొటోలనూ జత చేస్తున్నారు. పాన్‌ ఇండియా స్టార్‌ అయ్యే సరికి విజయ్‌కు గర్వం పెరిగిందంటూ విమర్శిస్తున్నారు.

లైగర్
లైగర్

లైగర్‌ టీమ్‌కు వ్యతిరేకత ఉన్నప్పటికీ అభిమానుల నుంచి సపోర్ట్‌ మాత్రం మెండుగానే లభిస్తోంది. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా విజయ్‌ పరిశ్రమలోకి అడుగుపెట్టారని, ఆయన ఫ్రెండ్లీ నటుడని పేర్కొంటూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో విజయ్‌కు సపోర్ట్‌ చేస్తూ #Vijay Deverakonda అనే ట్యాగ్‌ సైతం ట్విటర్‌లో దూసుకెళ్తోంది. ఏది ఏమైనా ఈ బాయ్‌కాట్‌ ట్రెండ్‌ సినీ పరిశ్రమకు కొత్త సమస్యగా మారిందని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాయ్‌కాట్‌ ట్రెండ్‌కి ఏదో ఒకరకంగా ముగింపు పలకాలని కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news