కొన్ని వేల అడుగుల ఎత్తులో.. ఎగుడు దిగుడుగా ఉండే పర్వత సానువుల్లో.. ఎముకలు కొరికే చలిలో.. దుర్భేద్యమైన వాతావరణ పరిస్థితుల నడుమ సహజంగానే మనుషులు మనుగడ సాగించడం కష్టం. అలాంటిది.. ఆ పరిస్థితుల్లో సైనికులు ఎన్నో అవస్థలు పడుతూ.. వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ.. దేశానికి కాపలా కాస్తుంటారు.
జమ్మూ కాశ్మీర్‌లోని అత్యంత కీలకమైన ప్రాంతాల్లో కార్గిల్ కూడా ఒకటి.. శ్రీనగర్‌కు కార్గిల్ సుమారుగా 205 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సాధారణంగా హిమాలయాల్లోని అన్ని ప్రాంతాల్లాగే కార్గిల్‌లోనూ వాతావరణం అత్యంత శీతలంగా ఉంటుంది. చలికాలంలో కార్గిల్ ఉష్ణోగ్రతలు −48 °C వరకు నమోదవుతుంటాయి. శ్రీనగర్-లేహ్‌లను కలిపే జాతీయ రహదారి (ఎన్‌హెచ్ 1డి) కార్గిల్ నుంచే వెళ్తుంది. అయితే ఈ ప్రాంతంలో ఎటు చూసినా కొండలే ఉంటాయి. ఆ కొండల ఎత్తు సుమారుగా 16వేల అడుగుల నుంచి 18వేల అడుగులు ఉంటుంది. అంతటి ఎత్తులో సైనికులు స్థావరాల్లో నిత్యం పహారా కాస్తుంటారు.
కొన్ని వేల అడుగుల ఎత్తులో.. ఎగుడు దిగుడుగా ఉండే పర్వత సానువుల్లో.. ఎముకలు కొరికే చలిలో.. దుర్భేద్యమైన వాతావరణ పరిస్థితుల నడుమ సహజంగానే మనుషులు మనుగడ సాగించడం కష్టం. అలాంటిది.. ఆ పరిస్థితుల్లో సైనికులు ఎన్నో అవస్థలు పడుతూ.. వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ.. దేశానికి కాపలా కాస్తుంటారు. ఈ క్రమంలో అలాంటి స్థితిలో శత్రువులు దాడి చేస్తే ఆ దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టగలిగే నేర్పు సైనికులకు ఉండాలి. అయితే అదృష్టవశాత్తూ మన సైనికులకు అలాంటి తెగువ, ధైర్య సాహసాలు, యుద్ధ నైపుణ్యాలు, యుద్ధ వ్యూహాలను రచించే ప్రతిభ పుష్కలంగా ఉన్నాయి. దీంతో భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన పాక్ సైనికులను, ఉగ్రవాదులను భారత జవాన్లు ఎప్పటికప్పుడు గుర్తించి వారిని మట్టుబెట్టారు.
కార్గిల్ యుద్ధంలో తీవ్రమైన వాతావరణ పరిస్థితుల నడుమ శత్రుదేశ సైనికులు, ఉగ్రవాదులతో భారత సైనికులు పోరాడిన తీరు అనిర్వచనీయం. ముష్కరులను తరిమికొట్టడమే లక్ష్యంగా భారత సైనికులు చూపిన తెగువ, ధైర్య సాహసాలను మనం ఇప్పటికీ మరిచిపోలేం. దుండగులను మట్టు బెట్టేందుకు భారత త్రివిధ దళాలకు చెందిన సిబ్బంది కఠోరంగా శ్రమించారు. ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ.. ఎత్తైన కొండల మీద చలిలో ప్రయాణం చేస్తూ.. భారీగా బరువుండే యుద్ధ సామగ్రిని మోస్తూ.. ఒక్కో స్థావరాన్ని స్వాధీనం చేసుకుంటూ.. చివరకు భారత జవాన్లు విజయం బాటలో నిలిచారు. కార్గిల్ యుద్ధంలో భారత్ చివరకు అద్భుతమైన విజయం సాధించింది. అందులో మన సైనికుల పాత్రను నిజంగా మరువలేం. ఎన్ని సంవత్సరాలు గడిచినా వారు చూపిన పోరాట పటిమను భారతీయులందరూ గుర్తు చేసుకుంటూనే ఉంటారు.
పాక్‌తో జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత్‌కు చెందిన సైనికులు 527 మంది చనిపోయారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ యుద్ధంలో మరో 1363 మంది భారత జవాన్లు గాయపడ్డారు. ఒకరు యుద్ధ ఖైదీగా పాక్‌కు చిక్కారు. ఇక ఈ యుద్ధంలో భారత్ కన్నా పాక్‌కే ఎక్కువగా నష్టం జరిగింది. ఆ దేశానికి చెందిన సైనికులు 4వేల మంది వరకు చనిపోయారు. 665 మందికి పైగా గాయపడ్డారు. మరో 8 మంది పాక్ సైనికులు భారత్‌కు యుద్ధ ఖైదీలుగా చిక్కారు. ఏది ఏమైనా.. కార్గిల్ యుద్ధంలో యావత్ భారత ప్రజల కోసం పోరాడిన సైనికులకు కచ్చితంగా మనం శాల్యూట్ చేయాల్సిందే.. వారిని కార్గిల్ విజయ్ దివస్ రోజున గుర్తు చేసుకోవాల్సిందే..!