తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ ని మళ్ళీ అదుపులోకి తీసుకునే అవకాశముందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. సోమవారం అసెంబ్లీ ముట్టడికి రైతులు పిలుపునివ్వగా ఆయన వారికి మద్దతుగా పోలీసుల ఆంక్షలను కూడా పట్టించుకోకుండా అసెంబ్లీ ముట్టడికి రాళ్లు, గుట్టలు దాటుకుంటూ ముళ్లకంచెలను తోసుకుంటూ వచ్చేశారు. దీనితో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గుంటూరు సబ్ జైలు కి తరలించగా మంగళగిరి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన్ను విడుదల చేసారు. అయితే గల్లా వ్యవహారంలో ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. దీనితో ఆయనకు క్రైమ్ నెంబర్ 31పై పీటి వారెంట్ జారీ చేశారు. బెయిల్‌పై ఇంటికి చేరుకున్న గల్లాను మళ్లీ అదుపులోకి తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ మేరకు ఆయన ఇంటి చుట్టూ భారీ ఎత్తున పోలీసులు చుట్టుముట్టారు.
అయితే ఈ వ్యవహారంపై గల్లా స్పందించారు. తనను ఎన్ని సార్లు జైల్లో పెడతారో పెట్టుకోవాలి అంటూ సవాల్ చేసారు. ఇక ఈ వ్యవహారం తెలియడంతో గల్లా ఇంటికి భారీగా తెలుగుదేశం కార్యకర్తలు చేరుకున్నారు. ఆయనకు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. అయితే ఆయన్ను ఏ క్షణం అయినా సరే అరెస్ట్ చేసే అవకాశం ఉందని, ఆయనకు ఈసారి బెయిల్ రావడం కష్టమనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి.