రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు విషయంపై అమరావతి ప్రాంతంలోను, గుంటూరు జిల్లాలోనూ ఆందోళనలు జరుగుతున్నాయి. వీటిని టీడీపీ అధినేత చంద్రబాబే స్వయంగా ముందుండి నడిపిస్తు న్నారు. అయితే, రాజధాని ఆందోళన అనేది తన వరకే పరిమితం కాదని, రాష్ట్రం మొత్తానిదని, ప్రతి ఒక్కరూ కదిలి ముందుకు రావాలని బాబు అనేక సందర్భాల్లో పిలుపు నిచ్చారు. అయితే, మిగిలిన జిల్లాల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన నెల్లూరులో మాత్రం ప్రజల నుంచి స్పందన బాగానే ఉంది.
విశాఖలో రాజధానిని ఏర్పాటు చేస్తే.. తమకు దూరాభారం అవుతుందని ఇక్కడి ప్రజలు అంటున్నారు.
దీంతో చంద్రబాబు చేస్తున్న రాజధాని ఉద్యమానికి ఇక్కడి ప్రజలు పరోక్షంగా మద్దతిస్తున్నారు. ఇక, ప్రత్య క్షంగా మద్దతిచ్చేందుకు కదలాలని ఉన్నప్పటికీ.. వీరిని నడిపించే నాయకులు మాత్రం కరువయ్యా రని అంటున్నారు. మొత్తం అన్ని నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీ నేతలే ఉన్నందున ప్రజలకు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు బలమైన నాయకత్వం అవసరం.
ఈ క్రమంలో టీడీపీ నాయకులు ముందుండి ప్రజలను నడిపిస్తారని అనుకుంటే… వారంతా కూడా సైలెంట్ అయిపోవడం అందరినీ విస్మయానికి గురి చేసింది. ఒకపక్క పార్టీ అధినేత చంద్రబాబు రాజధాని కోసం ప్రయత్నిస్తుంటే.. ఇక్కడ మాత్రం నాయకులు స్తబ్దుగా ఉన్నారు. ఇక, ఇదే జిల్లా గురించి చెప్పుకోవాల్సి వస్తే.. ఇక్కడ నుంచి మంత్రిగా వచ్చిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పూర్తిగా సైలెంట్ అయిపోయారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఎన్నికల్లో వరుస పరాజయాలు వెంటాడినా.. ఎమ్మెల్సీ ద్వారా మంత్రి పీఠాన్ని అలంకరించిన సోమిరెడ్డి.. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో అయినా విజయం వరిస్తుందని అనుకున్నారు.
కానీ, ఆయన వ్యూహం మరోసారి తప్పింది. దీంతో ఇప్పుడు ఆ యన సైలెంట్ అయిపోయారు. నిన్న మొన్నటి వరకు ఒకింత బాణీ వినిపించినా.. అనూహ్యంగా ఇప్పుడు కీలక సమయంలో మాత్రం సైలెంట్ అయిపోవడం గమనార్హం. మొత్తంగా చూస్తే.. నెల్లూరు టీడీపీలో ఒక విధమైన స్తబ్దత నెలకొందనేది వాస్తవం అంటున్నారు పరిశీలకులు.