అక్రమాస్తుల కేసులో విచారణలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ హాజరు కాలేదు. ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి నేడు కోర్ట్ మినహాయింపు ఇచ్చింది. ప్రభుత్వ కార్యక్రమాల కారణంగా ఆయన కోర్ట్ కి హాజరు కావడం లేదని కోర్ట్ కి తెలిపారు. దీనితో ఆయనకి నేడు విచారణకు మినహాయింపు ఇచ్చింది కోర్ట్. ఈ కేసులో విచారణకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, తెలంగాణా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి,
శ్రీలక్ష్మి సహా పలువురు ఐఏఎస్ అధికారులు హాజరయ్యారు. తాను కోర్ట్ కి హాజరు అయితే, తనకు హైదరాబాద్‌లో భద్రత కల్పించేందుకు చాలా ఖర్చవుతుందనీ, అందువల్ల వ్యక్తిగత హాజరు నుంచీ మినహాయింపు ఇవ్వాలని జగన్ తరుపు న్యాయవాదులు కోర్ట్ కి విన్నవించారు. దానికి సిబిఐ అడ్డు తగిలి సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆయన కోర్ట్ కి హాజరు కావాలని స్పష్టం చేసింది.
దీనితో సిబిఐ న్యాయవాది కూడా ఆయన ప్రతీ శుక్రవారం కోర్ట్ కి హాజరు కావాలని స్పష్టం చేసారు. ఈ నెల 10న జగన్ కోర్ట్ కి హాజరయ్యారు. జనవరి 10న కోర్టుకు హాజరైన సీఎం జగన్, జనవరి 17న హాజరు నుంచీ మినహాయింపు కోరారు. ఇక ఈ కేసుల్లో ఇప్పటికే జగన్ కి వరుస షాక్ లు తగులుతూ వచ్చాయి. పలు పిటీషన్ లను కలిపి ఒకేసారి విచారించాలని కోరగా దానికి కోర్ట్ అభ్యంతరం తెలిపింది.