సీబీఐలో మరోసారి లంచాల వ్యవహారం

-

దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐలో మరోసారి ముడుపుల వ్యవహారం తీవ్ర సంచలనం రేపుతోంది. గతంలో సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ, సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానా పరస్పరం అవినీతి, అధికార దుర్వినియోగ ఆరోపణలు చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సీబీఐ విశ్వసనీయతపై అప్పట్లో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడేమో బ్యాంకు మోసాలకు పాల్పడిన కంపెనీల నుంచి ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలు సీబీఐలో సంచలనం రేపుతున్నాయి.

నేరగాళ్లను చట్టానికి పట్టించి శిక్ష విధించేలా చేయాల్సిన సీబీఐ అధికారులే తప్పుడు మార్గంలో పయనిస్తున్నారు. బ్యాంకులను మోసం చేసిన నిందితులకు ఆసరాగా నిలుస్తున్నారు. ముడుపులు అందుకుని మోసగాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు. బ్యాంకు మోసాలకు పాల్పడిన కంపెనీల నుంచి ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలతో ఇద్దరు సీబీఐ అధికారులను… ఆ సంస్థ సస్పెండ్ చేసింది. మరో ఇద్దరు సీబీఐ అధికారులపై సంస్థాగత చర్యలు తీసుకోనుంది. సీబీఐ సస్పెండ్ చేసిన అధికారుల్లో కపిల్ ధన్‌కడ్ అనే సీబీఐ ఇన్‌స్పెక్టర్‌, సమీర్ కుమార్ సింగ్ అనే స్టెనోగ్రాఫర్ ఉన్నారు.

సంస్థాగత చర్యలను ఎదుర్కొంటున్న అధికారుల్లో డిప్యూటీ సూపరింటెండెంట్ స్థాయి అధికారులైన ఆర్కే రిషి,ఆర్కే సంగ్వాన్ ఉన్నారు. దాదాపు 4300 కోట్ల బ్యాంకు మోసాలకు పాల్పడిన కంపెనీల నుంచి వీరు ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. శ్రీశ్యామ్ పల్ప్ అండ్ బోర్డ్ మిల్స్, ఫ్రోస్ట్ ఇంటర్నేషనల్ అనే సంస్థలను బ్యాంకు మోసాల నుంచి గట్టెక్కించేందుకు ఈ నలుగురు అధికారులు ముడుపుల వ్యవహారానికి తెర లేపారు. ఆ రెండు సంస్థలు బ్యాంకులకు 700 కోట్ల వరకు కుచ్చుటోపీ పెట్టాయి.

విచారణను పక్కదారిపట్టించి ఆ కంపెనీలను ఈ వ్యవహారం నుంచి గట్టెక్కించేందుకే ఈ నలుగురు లంచాలు తీసుకున్నారని సమాచారం. ప్రస్తుతం సీబీఐలో ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న కపిల్ ధన్‌కడ్ గతంలో ఎస్బీఐ మేనేజర్‌గా పని చేశారు. డిప్యూటేషన్‌పై ఆయన సీబీఐలోకి వచ్చారు. ముడుపుల వ్యవహారంలో ఆయనకు 25లక్షల దాకా ముట్టినట్లు సీబీఐ గుర్తించింది. విచారణలో రాజీపడటంతో పాటు దర్యాప్తునకు సంబంధించి కీలక సమాచారాన్ని నిందితులైన ఇద్దరు డీఎస్పీలకు ఆయన చేరవేశారనే ఆరోపణలున్నాయి.

ఇంత భారీ మోసాలకు పాల్పడిన సంస్థలను చట్టపరమైన చర్యల నుంచి తప్పించేందుకు సీబీఐ అధికారులే లంచాలు తీసుకోవడాన్ని ఆ సంస్థ తీవ్రంగా పరిగణిస్తోంది. సీబీఐ సహా ఏ ప్రభుత్వ శాఖలోనూ అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని సంస్థ అధికారులు వెల్లడించారు. ఈ నలుగురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.

Read more RELATED
Recommended to you

Latest news