గురువారం పెళ్లి శుక్ర‌వారం డ‌బ్బు,న‌గ‌లు తీసుకుని పెళ్లికూతురు జంప్..!

లేటు వ‌య‌సులో వివాహం చేసుకున్న ఓ వ‌రుడికి పెళ్లికూతురు ఊహించ‌ని షాక్ ఇచ్చింది. రంగారెడ్డి జిల్లా యాచారానికి చెందిన ఓ వ్య‌క్తి న‌ల‌భైఏళ్ల‌లో పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్నాడు. లేటు వ‌య‌సు కావ‌డంతో త‌న మిత్రుడి స‌హాయంతో ఓ బ్రోక‌ర్ ను క‌లిసాడు. ఆ బ్రోక‌ర్ విజ‌య‌వాడ‌లో అమ్మాయి ఉంద‌ని చెప్పి ల‌క్ష‌తీసుకున్నాడు. అమ్మాయికి ముందూ వెన‌కా ఎవ‌రూ లేర‌ని విజ‌య‌వాడ‌లోని ఓ లాడ్జిలో వివాహం జ‌రిపించాడు. గురువారం ఇద్ద‌రి వివాహం జ‌ర‌గ్గా అదే రోజు కొత్త పెళ్లి కూతురుతో వ‌రుడు త‌న స్వ‌గ్రామానికి చేరుకున్నాడు.

అంతా హ్యాపీ అనుకున్న స‌మ‌యంలో పెళ్ళికూతురు షాక్ ఇచ్చింది. పెళ్లికి ముందు బాధితుడితో మూడు తులాల బంగారు గొలుసు..40 వేల షాపింగ్ చేయించింది. ఇంటికి వ‌చ్చిన త‌ర‌వాత కొత్త బీరువాలో బ‌ట్ట‌లు స‌ర్దుతున్న‌ట్టు న‌టించి అందులో ఉన్న రూ.2 ల‌క్ష‌లు కూడా కాజేసింది. త‌న నొప్పిగా ఉంద‌ని టాబ్లెట్ తేవాల‌ని భ‌ర్త‌ను కోర‌డంతో అత‌డు భ‌య‌ట‌కు వెళ్లాడు. దాంతో సందు చూసుకుని కారు బుక్ చేసుకుని జంప్ అయ్యింది. బాధితుడు ల‌బో దిబోమంటూ పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతో కేసు న‌మోదు చేసుకుని విచార‌ణ చేప‌డుతున్నారు.