దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. వీటి పోలింగ్ ఇవాళ ఉదయం ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. బిహార్‌లోని మొకామా, గోపాల్‌గంజ్, మహారాష్ట్రలోని అంధేరి (తూర్పు), హర్యానాలోని అదమ్‌పూర్, తెలంగాణలోని మునుగోడు, యూపీలోని గోల గోకర్నాథ్, ఒడిశాలోని ధామ్నగర్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి.
ఆయా నియోజకవర్గ స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరణించడం, మరికొన్నింటిలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కారణంగా ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. గత నెలలో ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలవగా.. ఇవాళ పోలింగ్ జరుగుతోంది. ఈనెల 6న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఏడు నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. సమస్యాత్మక ఓటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు మరింత పటిష్ఠంగా ఉంచామని చెప్పారు.