మడమతిప్పనని ప్రజల సాక్షిగా ప్రతిజ్ఞ చేసిన వైసీపీ అధినేత సీఎం జగన్.. పోలవరం టెండర్ల విషయంలో తీసుకున్న నిర్ణయం విషయంలోనూ అదే రీతిలో ముందుకు సాగుతున్నారు. వాస్తవానికి ఈ విషయంలో అటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్రంలోని వివిధ పక్షాల నుంచి మేధావుల నుంచి మీడియా సంస్థల నుంచి కూడా జగన్‌పై ఒత్తిళ్లు పెరిగాయి. పోలవరం ప్రాజెక్టులో గేట్లు ఏర్పాటు చేయడం, ఎర్త్ కమ్ బ్రిడ్జి నిర్మాణ పనులను నామినేషన్ పద్దతిపై దక్కించుకుంది నవయుగ. ఈ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఇతర పోటీ సంస్తలను పిలవకుండానే అప్పటికే నిర్ణయించిన ధరలకు చేస్తానన్నదన్న ఏకైక కారణం చూపించి.. నవయుగ సంస్థను పోలవరం పనులకు దింపేశారు.
అయితే, పనులను ఒక కాంట్రాక్టర్ నుంచి మరో కాంట్రాక్టర్‌కు అప్పగించాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు పారదర్శకంగా ముందుకు సాగాల్సిన ప్రభుత్వం ఇలా నామినేషన్ పద్దతిపై అప్పగించడం లో ఏదో మతలబు ఉందని అప్పట్లోనే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ఆరోపించింది. అయితే, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే చంద్రబాబు ముందుకు సాగారు. ఈ క్రమంలోనే నవయుగ పనులు ప్రారంభించింది. అయితే, తాజా గా రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో జగన్ ఈ టెండర్లను రివర్స్ చేయాలని నిర్ణయించారు.
దీంతో పది హేను రోజుల కిందటి వరకు ముఖ్యంగా జగన్ అమెరికాలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కేంద్రం కూడా దీనిని వ్యతిరేకించింది. ఇంకేముంది రివర్స్ అంటే.. అన్ని ప్రాజెక్టులు ఆగిపోతాయని, పెట్టుబడులు పెట్టేవారు ఎవరూ ముందుకు రారని కేంద్ర మంత్రి షెకావత్ బహిరంగ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇంతలోనే జగన్ అమెరికా నుంచి రావడం, ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలతో మాట్లాడడంతో షెకావత్ సైలెంట్ అయిపోయారు.
దీంతో ఇప్పుడు తాజాగా జగన్ ప్రభుత్వం నవయుగ పనులు నిలిపివేస్తూ ..కేబినె ట్‌లోనే తీర్మానం చేసింది. అయితే, ఈ కేసుహైకోర్టులో ఉండడంతో ఆ కేసు, విచారణలో పేర్కొన్న మేరకు పనులను పక్కన పెట్టి.. మిగిలిన పనుల నుంచి నవయుగను తప్పించే విధంగా జగన్ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.